Saturday, November 23, 2024
HomeTrending Newsసంప్రదాయ భోజనం నిలిపేస్తాం: వైవి సుబ్బారెడ్డి

సంప్రదాయ భోజనం నిలిపేస్తాం: వైవి సుబ్బారెడ్డి

తిరుమలలో సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపివేస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  ప్రకటించారు.  గో ఆధారిత పదార్ధాలతో భక్తులకు సంప్రదాయ భోజనాన్ని అందించాలని అధికారులు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అయన అభిప్రాయపడ్డారు. అయితే తిరుమల కొండపై భక్తులకు అందించే ఏ ప్రసాదాన్నైనా ఉచితంగానే అందించాల్సి ఉంటుందని, డబ్బులు వసూలు చేయడం సరికాదని… అందుకే అధికారులతో మాట్లాడి ఈ సంప్రదాయ భోజన విధానానికి స్వస్తి పలికేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాలకమండలి లేని సమయంలో అధికారులు తీసుకున్న నిర్ణయమని సుబ్బారెడ్డి అన్నారు.

శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం అందించడంలో భాగంగా దేశీయ గోవుల ఉత్పత్తులతో చేసిన, సేంద్రీయ వ్య‌వ‌సాయం ద్వారా పండించిన బియ్యం, ప‌ప్పు దినుసులు, బెల్లం, నెయ్యితో శ్రీవారికి అన్న ప్రసాదాల నైవేద్యం కొంతకాలంగా అందిస్తున్నారు.  ఇదే కోవలో దేశీయ వ్య‌వ‌సాయంతో పండించిన బియ్యం, ప‌ప్పు దినుసుల‌తో త‌యారు చేసిన అల్ఫాహ‌రం, భోజ‌నం ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం తయారీకి అయిన ఖర్చును మాత్రమే భక్తులనుంచి వసూలు చేయాలని, అదికూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా కేవలం ఈ సంప్రదాయ భోజనం కావాలనుకునే వారికే అందించాలని  టిటిడి  సంక‌ల్పించింది.  ఆగ‌స్టు 26న ఈ విధానాన్ని ప్ర‌యోగ‌త్మ‌కంగా అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ప్రారంభించారు.

అయితే దీనిపై దేవదేవుడి భక్తులనుంచి పెద్దఎత్తున విమర్శలు మొదలయ్యాయి. ఉచిత భోజన పథకానికి మంగళం పలికేందుకే ఈ సంప్రదాయ భోజన పధ్ధతి తీసుకువస్తున్నారని  భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.  అందుకే ఈ విషయంలో పునరాలోచన చేసి సంప్రదాయ భోజనం రద్దు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్