జీవితం ఎలా మొదలవుతుందో .. ఎక్కడ ఎలాంటి మలుపు తీసుకుంటుందో .. చివరికి ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు. అంతా మంచే జరుగుతున్నప్పుడు అది తమ గొప్పతనం అనుకుంటారు .. ఎక్కడ ఎలాంటి తేడా కొట్టేసినా కాలాన్ని నిందిస్తారు. జరిగిన దానికి తాము కారణం కాదన్నట్టుగా ‘విధిరాత’ అలా ఉందని ఓ ముగింపును ఇచ్చేస్తారు. ఇలా ఓటమిని ఒప్పుకోలేక, ఓదార్చేవారిని దూరం చేసుకున్నవారు ఎంతోమంది కనిస్తారు. అలాంటివారిలో ఒకరిగా హాస్యనటి గిరిజ మనకి కనిపిస్తారు. తన కృషితో అంచలంచెలుగా ఎదిగిన గిరిజ, తాను తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాల కారణంగా పాతాళానికి జారిపోయారు.
కృష్ణా జిల్లా ‘కంకిపాడు’ గ్రామంలో గిరిజ జన్మించారు. ఆమె తల్లి దాసరి తిలకం గొప్ప రంగస్థల నటి .. సినిమాల్లోను ఆమె నటిస్తూ ఉండేవారు. గిరిజ కూడా నాటకాల పట్ల ఆసక్తిని చూపుతూ వచ్చారు. ఆ తరువాత టీనేజ్ లోకి అడుగుపెడుతూనే ఆమె సినిమాల పట్ల ఉత్సాహాన్ని చూపించారు. ఆ సమయంలో కస్తూరి శివరావు ‘పరమానందయ్య శిష్యులు’ సినిమాకి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ – చిత్తూరు నాగయ్య కాంబినేషన్లోని ‘పరమానందయ్య శిష్యుల కథ’కి ఇది ముందుగా వచ్చింది. ఈ సినిమాలో ఏఎన్నార్ సరసన గిరిజకు కస్తూరి శివరావు అవకాశం ఇచ్చాడు.
ఆ సినిమా అంతగా ఆదరణ పొందకపోయినా, గిరిజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఆమె తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తనకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ వెళ్లారు. ‘పాతాళభైరవి’ సినిమాలో ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఆమె పాప్యులర్ అయ్యారు. ఇక ఈ సమయంలోనే రేలంగి తన జోడీగా ఆమెను ప్రోత్సహించారు. గిరిజ చాలా వేగంగా హావభావాలను మార్చేస్తూ ఉంటారు. గయ్యాళి భార్యగా .. గడుసు పెళ్ళాంగా .. భర్త చెప్పే అబద్ధాలు నమ్మేసే అమాయకురాలైన ఇల్లాలుగా ఆమె రేలంగి సరసన మెప్పించారు. అలా ఆమె కెరియర్ ఊపందుకుంది .. హాస్యనటిగా ఆమె అగ్రస్థానాన్ని అందుకున్నారు.
‘అన్నపూర్ణ’ సినిమాలోని ‘కులాసా రాదోయ్ రమ్మంటే’ అంటూ రేలంగితో సాగే పాట చూస్తే ఆమె ఎంత మంచి డాన్సరో .. ఎంత గొప్పగా హావభావాలను పలికిస్తారో తెలుస్తుంది. ఇక ‘వెలుగు నీడలు’ సినిమాలో ఏఎన్నార్ భార్య పాత్రలో సావిత్రిని అపార్థం చేసుకునే సన్నివేశంలో ఆమె నటనను అంత తేలికగా మరిచిపోలేము. కామెడీని మాత్రమే కాదు, ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ను కూడా గిరిజ గొప్పగా పండించగలదని నిరూపించారు. వీటితో పాటు ‘గుడిగంటలు’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ .. ‘ఆరాధన’ సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి.
అప్పట్లో రేలంగి – గిరిజ లేని సినిమా ఉండేది కాదు. సూర్యకాంతం కూతురుగా ఆమె పోయిన గారాలు .. రేలంగి ప్రియురాలిగా పడిన వగలు ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. వాల్ పోస్టర్ పై వాళ్లు కనిపిస్తేనే సినిమాకు వెళ్లే అభిమానులు ఉండేవారు. దర్శక నిర్మాతలు కథ ఏదైనా వారి కోసం సెపరేటుగా ఒక ట్రాకు పెట్టేవారు. సినిమాలో వారిపై ఒక పాట ఉండేలా చూసుకునేవారు. ఆ సమయంలో గిరిజ డేట్లు దొరకడం కష్టమైపోయింది. పారితోషికంగా ఆమె ఎంత అడిగితే అంత ఇచ్చే పరిస్థితి. రేలంగి సహాయ సహకారాలతో గిరిజ శ్రీమంతురాలిగా మారిపోయింది. కార్లు .. బంగ్లాలు రావడంతో విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుందనేది ఆమె చూశారు.
బలమున్నవాడు వినయంతో ఉండటం ఎంత కష్టమో, డబ్బులు ఉన్నప్పుడు ఎదుటివారు చెప్పే హితవు వినడం కూడా అంతే కష్టం. అలా గిరిజ కూడా తన ప్రేమపెళ్లి విషయంలో ఎవరి మాటా వినిపించుకోలేదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సన్యాసిరాజు అనే వ్యక్తిని గిరిజ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో రేలంగి దగ్గర నుంచి ఎవరు ఎన్ని విధాలుగా వారించినా ఆమె పట్టించుకోలేదు. సన్యాసిరాజుతో ఆమె వైవాహిక జీవితం మొదలైంది. ఆయనకంటూ చెప్పుకోవడానికి పెద్దగా పనిలేకపోవడంతో, భార్య డబ్బుతో సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. భర్త ప్రయత్నానికి గిరిజ తనవంతు సహకారాన్ని అందించారు.
సన్యాసిరాజు సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాడు. సినిమా తీయడమంటే .. సినిమా చూసినంత తేలిక కాదనే విషయం ఆయనకి అర్థమైంది. ఈ విషయంలో అనుభవం వచ్చేసరికి ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఎలాంటి పరిస్థితుల్లో మద్రాసుకు వచ్చారో .. అంతకంటే దారుణమైన పరిస్థితుల్లోకి గిరిజ జారిపోయారు. కార్లు .. బంగళాలు కళ్ల ముందే మాయమైపోవడంతో, ఒక చిన్న ఇంట్లో ఆమె అద్దెకు ఉంటూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ వెళ్లారు. చివరికి ఆర్ధిక పరమైన ఇబ్బందులతో సతమతమవుతూనే తన అభిమానులను విడిచి ఈ లోకం నుంచి వెళ్లిపోయారు.
బ్లాక్ అండ్ వై సినిమాల కాలంలో తారాజువ్వలా నింగిలోకి దూసుకుపోయినవారిలో కొంతమంది మాత్రమే అక్కడ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. మిగతావాళ్లంతా ఎక్కడ ఎలా తమ ప్రయాణాన్ని ప్రారంభించారో తిరిగి అక్కడికే చేరుకున్నారు. అయితే అప్పటికే పోరాడేశక్తి పోగొట్టుకోవడం వలన, కష్టకాలం ఎలా ఉంటుందనేది కళ్లు తెరుచుకున్నాకే చూశారు. తెరపై గడుసుగా .. గయ్యాళిగా కనిపించే గిరిజ జీవితాన్ని పరిశీలిస్తే, నిజ జీవితంలో ఆమె ఎంత అమాయకురాలనే విషయం అర్థమవుతుంది. అలాంటి గిరిజ వర్ధంతి నేడు .. ఈ సందర్భంగా ఆమెను ఒకసారి స్మరించుకుందాం.
(వర్ధంతి ప్రత్యేకం)
– పెద్దింటి గోపీకృష్ణ