ప్రజల కష్టాలు, కన్నీళ్లను తెలుసుకుని భరోసా నింపేందుకే పాదయాత్ర చేపట్టానన్న బండి సంజయ్ ప్రజల సమస్యలను 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిష్కరించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని వెల్లడించారు. కేసీఆర్ అంటేనే తుగ్లక్. టీఆర్ఎస్ తుగ్లక్ పార్టీ. మజ్లిస్ తాలిబన్ పార్టీ అని ఘాటుగా విమర్శించారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్ర. చౌటుకూరు సభలో మాట్లాడుతు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కెసిఆర్ – ఎం ఐ ఎం పార్టీల లోపాయికారీ ఒప్పందం వల్లే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు.
బండి సంజయ్ ప్రసంగ పూర్తి పాఠం…
రోడ్డు కోసం స్థలమిస్తే….ఇండ్లు కట్టిస్తానన్నడు. కానీ కట్టియ్యలేదు. నేను వెళ్లి చూసిన ఎట్ల బతుకున్నరో అని బాధేస్తుంది. కిలోమీటర్ కో బారు పెట్టిండు. సార్ ధ్యాసంతా బార్, బీర్ మీదే తప్ప జనం మీద లేదు. ఇది ఎస్సీ నియోజకవర్గం. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదు. జనం ఇల్లు లేక నానాపాట్లు పడుతున్నరు. ఎన్నికలొస్తే…ఓ ఇద్దరి ముగ్గురికి ఇండ్లిస్తడు. తరువాత పత్తా లేకుండా పోతడు.
తెలంగాణలో 6.5 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని అంచనా వేసిండ్రు. జనం చస్తుండ్రు. రైతులు నష్టోయిండ్రు. కానీ సార్ ఢిల్లీ పోయి పడుకుండు. ఇక్కడ పీకేది లేదు. అక్కడ పీకేది లేదు. అసలు ఫాంహౌజ్ లో ఏం చేస్తడో అర్ధం కాలేదు. 7 ఏళ్లు ఫాంహౌజ్ కే పరిమితమైండు. బయట పేదోడికి కోవిడ్ వచ్చినా డాక్టర్లు రారు…కానీ కేసీఆర్ ఫాంహౌజ్ లో కుక్కకి సుస్తీ అయినా అంబులెన్సులు వెళతాయి. కేసీఆర్ కుక్కకున్న విలువ. పేదోళ్ల ప్రాణాలకు లేకుండా పోయింది.
పేదోళ్లకు ఆపదొస్తే పత్తా లేరు. హైదరాబాద్ లో వరదలొస్తే సీఎం రాలేదు. వరంగల్ లో వరదలొచ్చి పేదల ఇండ్లు మునిగిపోయినయ్. సీఎం మాత్రం హైదరాబాద్ దాటి రాలేదు. ఆర్టీసీ కార్మికులు చస్తే కనీసం స్పందించలేదు. మూర్ఖపు సీఎం కొడుకు నిర్లక్ష్యంవల్ల ఇంటర్మీడియట్ కు చెందిన 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు.
ఈ ప్రాంతానికి సింగూరు నీళ్లిస్తామని, తరువాత కాళేశ్వరం నీళ్లిస్తామని చెప్పి మాట తప్పి అంచనాలు పెంచి వేల కోట్లు కమీషన్లు దండుకుంటున్నడు.
ఎన్నికలొస్తే కోతలు కోస్తడు. ఊకదంపుడు ఉపన్యాసాలిస్తడు. కానీ చేసేదేమీ ఉండదు. దళితులకు 3 ఎకరాలన్నడు. ఎంతమందికి ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగమిస్తనన్నడు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తనన్నడు. కానీ ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంటేనే దళితులను వంచించే పార్టీ. దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్ధం కావడం లేదు. ప్రగతి భవన్ లో 100 కోట్లతో రూములు కట్టుకున్నడే తప్ప అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు.
ఉద్యోగస్తులకు జీతాల్లేవు. జీతాలే ఇవ్వలేని సీఎం దళిత బంధు ఇస్తాడట. 15 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తలేడు.
కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు వేల కోట్లు ఇస్తోంది. బియ్యం పైసలు కేంద్రానివే. ఒక్కో కిలోకు 29 రూపాయలు కేంద్రమే ఇస్తోంది. ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తోంది కేంద్రమే. కానీ ఫొటోలు మాత్రం కేసీఆర్ వి పెట్టుకుంటన్నడు. బియ్యం, లైట్ల, రోడ్లు, చెట్ల, కమ్యూనిటీ హాళ్లు, నీళ్లు, టాయిలెట్ సహా చివరకు స్మశానవాటిక నిర్మాణాలకు పైసలిచ్చేది కేంద్రమే.
పోతూపోతూ స్మశాన వాటికను చూసిన. ఒక్కో స్మశాన వాటికకు 11.13 లక్షలు, పల్లె ప్రక్రుతి వనానికి రూ.4.23 లక్షలు, డంప్ యార్డ్ కు రూ. 2.50 లక్షలు, నర్సరీకి 1.56 లక్షలు, రైతు వేదికలకు 10 లక్షలు ఇస్తోంది కేంద్రమే. స్వనిధి కింద యువకులకు రూ.10 వేలు ఇస్తోంది కేంద్రమే.
తెలంగాణను వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. హిందూ ధర్మాన్ని, దేవుళ్లను, సమాజాన్నీ చీల్చే పార్టీ ఎంఐఎం.
నువ్వు నిఖార్సైన హిందువున్నవ్ కదా….వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోకుండా యువకులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నవ్. మండపాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు? యువకులపై బైండోవర్ కేసులెందుకు పెడుతున్నవ్. ఆంక్షల మధ్య హిందువులు పండుగలు నిర్వహించుకోవాలా?
నన్ను మతతత్వవాది అన్నా సరే…80 శాతం హిందువుల కోసం బరాబర్ మాట్లాడతా. నా హిందూ సంఘటిత శక్తిని దేశానికి చాటడమే నా లక్ష్యం.
సెప్టెంబర్ 17వ తేదిన నిర్మల్ అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్న. కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపించి తీరుతం. తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా ఎంఐఎం నేతలకు భయపడి విమోచన దినోత్సవాన్ని జరపడానికి వెనుకాడుతున్న అవకాశవాది కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు.
పదమూడవ రోజు పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ, మార్తినేని ధర్మారావు, రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, సంగప్ప కలిసి నడుస్తున్నారు