ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ కరువుపై సుదీర్ఘ పోరాటం చేసిన నేత, అభ్యుదయవాది, డాక్టర్ యం.వి. రమణారెడ్డి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో నేటి ఉదయం మరణించారు. షుమారు సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయన వయస్సు 80 సంవత్సరాలు. రాజకీయనేతగా, ఉద్యమకారుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, మేధావిగా గొప్ప పేరు సంపాదించిన రమణారెడ్డి సమస్యలపై నిక్కచ్చిగా తన అభిప్రాయం వెల్లడించే వారు.
ఆయన రాసిన ‘రాయలసీమ కన్నీటిగాథ’ సీమ కరువు పరిస్థితులను ప్రతిబింబించి లక్షలాది మంది కంట కన్నీరు ఒలికించింది. ఆర్‌కె నారాయణ్ రాసిన ‘ A Tiger for Malgudi’ పుస్తకాన్ని ‘పెద్ద పులి ఆత్మకథ’గా అనువదించారు. మార్గరెట్ మిఛల్ ‘ Gone with the Wind’ను ‘చివరికి మిగిలింది’గా అనువదించారు.
ఎం.వి.రమణారెడ్డి గొప్ప మేధావి. ఆయన విధానాలతో విభేదించినవారు కూడా అయన మేధస్సును మెచ్చుకున్నవారే. చివరిరోజుల్లో దాదాపు 10 నెలలుగా 24 గంటలు ఆక్సిజన్ తో జీవించారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ‘ప్రపంచ చరిత్ర ముగింపు’, ‘అమ్మ’ నవల అనువాదం ‘కడుపుతీపి’ రాశారు. అయన మృతి తెలుగు సాహితీ రంగానికి, రాయలసీమ హక్కులకు తీరని లోటు.
ఎం.వి. రమణారెడ్డి మృతిపై సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కవిగా, చరిత్రకారుడిగా రాయలసీమ అభివృద్ధి కోసం నిరంతరం తపించిన వ్యక్తిగా, రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడిగా అయన చేసిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు. అయన కుటుంబ సభ్యులకు సిఎం జగన్ ప్రగాడ సానుభూతి తెలియజేశారు.