Saturday, November 23, 2024
HomeTrending Newsమెజార్టీ పెరగాలి : జగన్ సూచన

మెజార్టీ పెరగాలి : జగన్ సూచన

బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీకి భారీ ఆధిక్యం లభించేలా నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.  2019లో దివంగత ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య కు 44 వేలకు పైగా మెజార్టీ వచ్చిందని, ఈసారి అంతకుమించి రావాలని సూచించారు. బద్వేలు ఉపఎన్నికపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. వైసీపీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య డా. దాసరి సుధను అభ్యర్థిగా నిలబెడుతున్నామని, ఆమె కూడా డాక్టరే అని, జగన్ ఆమెను నేతలకు పరిచయం చేశారు.  ఉపఎన్నికల బాధ్యతను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.

బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ పెద్దిరెడ్డితో పాటు ఇక్కడకు వచ్చిన వారందరిమీదా ఉన్నాయని, నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆదేశించారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని. కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని నిర్దేశించారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని, ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగేలా కార్యకర్తలు ఓటర్లను ప్రోత్సహించాలన్నారు.  ప్రతి సామాజికవర్గాన్ని కలుపుకుపోవాలని,  గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని, ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని ఓట్లు అభ్యర్థించాలని జగన్ పేర్కొన్నారు.

ప్రజలు పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యం చేయాలని, నెలరోజులపాటు మీ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని కోరారు.  వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని,  మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని కోరారు.

ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి (మైనార్టీ వ్యవహారాలు) అంజాద్‌ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు,  పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్