దేవీ నవరాత్రుల ప్రారంభం రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దర్శించుకున్నారు. నేడు తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి అలంకారం అనంతరం జరిగిన తొలి పూజలో గవర్నర్ దంపతులు పాల్గొన్నారు.
గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవాదాయ శాఖా అధికారులు, ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఆలయ ఈవో, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదం ఆశీర్వచనం చేశారు.
అనంతరం ప్రజలకు గవర్నర్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారితో సమస్త మానవాళి ప్రమాదంలో పడిందని, యావత్ మానవాళిని దుర్గా మాత చల్లగా చూడాలని, అతి త్వరలో కరోనా మహమ్మారిని పారదోలేలా చూడాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు గవర్నర్ చెప్పారు. తెలుగు ప్రజలకు అమ్మవారి కృప, కరుణా కటాక్షాలు లభించాలని గవర్నర్ ఆకాంక్షించారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు గవర్నర్ సూచించారు.