Saturday, November 23, 2024
HomeTrending Newsఏ దేశం వారికైనా హైదరాబాద్‌ అనుకూలం

ఏ దేశం వారికైనా హైదరాబాద్‌ అనుకూలం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టే ఫ్రెంచ్‌ సంస్థలకు పెద్దపీట వేస్తామని.. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతిపాదనలకు సమానంగా లేదా వాటికి మించి భారీగా ప్రోత్సాహకాలు అందిస్తామని, పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమమైన టీఎస్‌ఐపాస్‌ పారిశ్రామిక విధానం రాష్ట్రంలో అమలవుతోందని, దీని ద్వారా రూ.వేలకోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు తెలంగాణకు దక్కాయన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని, ఇక్కడికి వచ్చిన ప్రతీ సంస్థ లాభాల బాటలో సాగుతోండడం తమకు గర్వకారణమని తెలిపారు. ఫ్రెంచ్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన వంద మంది పారిశ్రామిక, వాణిజ్యసంస్థల అధిపతులు, ప్రతినిధుల బృందంతో హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో భారత్‌-ఫ్రాన్స్‌ పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య ఏర్పాటుచేసిన పెట్టుబడుల సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఐఎఫ్‌సీసీఐ అధ్యక్షుడు సుమీత్‌ ఆనంద్‌ ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ దేశంలో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ అగ్రగామి, రాష్ట్రంలో 89 దేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు నడుస్తున్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన సినోఫి, కియోలిస్‌, సెయింట్‌ గోబెన్‌, సాఫ్రిన్‌, క్యాప్‌ జెమిని వంటి కంపెనీలు ఇప్పటికే రాణిస్తున్నాయి. మరిన్ని పారిశ్రామిక సంస్థలు ఇక్కడి తమ కార్యకలాపాల విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. మధ్యతరహా కంపెనీలూ ఇక్కడ విజయవంతమవుతాయి. రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు అవసరమైన వనరులన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. జీవశాస్త్రాలు, ఐటీ, బయోటెక్‌, వైమానిక, రక్షణ తదితర రంగాలకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యంగా ఉంది.

భారత్‌ను కేవలం కేంద్ర ప్రభుత్వ విధానాల ఆధారంగానే చూస్తే సరిపోదని.. తెలంగాణ లాంటి రాష్ట్రాలను ఇక్కడి ప్రభుత్వ విధానాలు, పెట్టుబడి అవకాశాల దృక్కోణంతో చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. ప్రపంచంలోని ఏ దేశం వారికైనా నివసించేందుకు అత్యంత అనుకూలమైన నగరం హైదరాబాద్‌. ఇది ఫ్రెంచ్‌ సంస్థలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. ఆయా కంపెనీల భవిష్యత్తు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది అంటూ కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్‌ పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో ముఖాముఖి సందర్భంగా వారి ప్రశ్నలకు కేటీఆర్‌ సమాధానాలు చెప్పారు. సమావేశానికి ముందు కేటీఆర్‌ ఫ్రెంచ్‌ రాయబారి, పారిశ్రామికవేత్తల బృందంతో ఆయన సమావేశమయ్యారు. రంగాలవారీగా అనుకూలతలను వారికి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్