Prakash Raj’s decision is not acceptable
నిన్న నాగబాబు..
ఇవాళ ప్రకాష్ రాజ్..
ఈ దారిలో ఇంకొందరు..
తన మాట చెల్లలేదని ఒకరు..
తనకు చెల్లుబాటు లేదని ఒకరు..
చక.. చకా రాజీనామాలు చేసేశారు.
మొత్తం మీద మెగా వర్గమంతా కలిసి మరో కుంపటికి రెడీ అవుతున్నారని ఒక పుకారు.
నిప్పులేనిదే పొగ, పుకారు రాకపోవచ్చు..రావచ్చు..
అలాగే మరో అసోసియేషన్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు.
చిరంజీవి వర్గం ఇప్పుడొక దెబ్బతిన్న పులి
ఆ కసితోనే ఈ మరో అసోసియేషన్ వార్తలు వస్తుండొచ్చు.
అయితే, పరిశ్రమ పెద్దరికం కోరుకునే చిరంజీవి, అదే పరిశ్రమను నిట్టనిలువుగా
చీల్చేఆలోచన చేయకపోవచ్చు.
దానివల్ల వచ్చే చెడ్డ పేరు కొని తెచ్చుకోకపోవచ్చు.
ఏదైనా ఒకటికి వందసార్లు ఆలోచించి,
ఒకరికి వందమందితో చర్చించే చిరంజీవి..
తమ్ముళ్ల ఆవేశాలకు తలాడించకపోవచ్చు.
ఏదేమైనా.. కోపాలు.. అలకలు..రాజీనామాలు..
నాగబాబు విషయంలో పెద్ద పట్టించుకోనక్కర్లేదు.
కానీ, ప్రకాష్ రాజ్ చేయడం ఏంటి.
గెలుపు ఓటములు ఎన్నికల్లో సహజమే అని ప్రకాష్ రాజ్ కి తెలియదా?
మనవాడు, పరాయి వాడు అనే బేధాలు తెచ్చారు సరే..
ఎన్నికలన్నాక అన్ని అస్త్రాలూ వాడతారని తెలియదా?
తన ఓటమికి అదొక్కటే కారణమనుకోవడం అమాయకత్వం కాదా?
ఎక్కడైనా వోటరు వోటరే..
ప్రచారాలకూ, ప్రలోభాలకూ ఎంతో కొంత ప్రభావితమవుతాడు..
ఇక్కడ కూడా పరాయివాడన్న ప్రచారం కొంత పనిచేసుండొచ్చు కానీ,
అదొక్కటే కారణం కాదు.
ఒకవేళ అయినా.. అలిగివెళ్ళిపోవడమేంటి..
నిలబడి పోరాడాలి కదా..
“మా” సభ్యుల్లో ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి కదా..
ఎక్కడి నుంచి వచ్చినా..
ఏ పదవి లేకపోయినా..
ఇక్కడ పనిచేయగలడని నిరూపించాలి కదా..
తన భావజాలం., తన సిద్ధాంతం,
ఒక్క ఎన్నికతో గాలికి కొట్టుకుపోతాయా?
ఒక్క ఓటమితో చాప చుట్టేస్తాడా?
మెజారిటీ సమాజం.. మోడీని కోరుకుంది కాబట్టీ, మిగిలిన పార్టీలన్నీ రద్దవుతాయా? నాయకులంతా పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటారా?
తన వెంట నడిచిన ప్యానెల్ పరిస్థితి ఏంటి..
అతనికి వోట్లేసి..కళకు ప్రాంతాల్లేవని చెప్పిన సభ్యులకు విలువేదీ?
600 మంది అభిప్రాయానికే భంగపడి యుద్ధరంగాన్ని వదిలేసేవాడిని రేపు విశాల ప్రజానీకం, వోటర్లు ఎలా నమ్మాలి.
రాజకీయాల్లో అతన్ని ఎవరైనా ఎందుకు సీరియస్ గా తీసుకోవాలి.
ప్రకాష్ రాజ్ మిగిలిన “నటుల్లా” కాదు..
కెమెరా లేనప్పుడు నటించడు ..
రాజీనామా పేరుతో డ్రామాలు ఆడడు..
అనుకుంటున్నాం కాబట్టీ, అతని ప్రకటనపై ఇన్ని ప్రశ్నలు..
సాదా సీదా రాజకీయాలైతే, ఇంత చర్చ అక్కర్లేదు.
-శైలి.