విజయవాడలోని దత్తాశ్రమంలో బస చేసిన మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కలుసుకుని అయన ఆశీస్సులు తీసుకున్నారు. తొలుత విజయవాడ నగరంలోని పటమట శ్రీ దత్తనగర్ లోని సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమానికి చేరుకున్న సిఎంకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలోని శ్రీ మహా గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామి, మరకత రాజరాజేశ్వరి అమ్మవార్లను ముఖ్యమంత్రి దర్శించుకున్నారు
తర్వాత శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిని కలుసుకుని వారికి పూలమాలలు, పండ్లు, పట్టు వస్త్రాలు అందజేశారు. తర్వాత కాసేపు స్వామివారితో సమావేశమై పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చలు జరిపారు.
సిఎం వెంట పర్యటనలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, రక్షణనిధి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రికి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులు అందజేశారు.