Monday, June 15, 2026
Homeసినిమాఓర్వకల్లు పొదుపు సంఘం మహిళాశక్తికి నిదర్శనం: సింగర్ సునీత

ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళాశక్తికి నిదర్శనం: సింగర్ సునీత

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలలో నూతన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రముఖ గాయని సునీత, కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ప్రారంభించారు. ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్నబాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు సునీత తెలిపారు. ఈ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పాఠశాలకు వస్తూ ఉంటానని తన వంతు సహకారం అందిస్తానని సునీత తెలిపారు.

లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్ లైన్ లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతికవిద్యను బోధించడానికి కృషి చేస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి తెలిపారు.

స్వయంకృషితో ఎదిగిన సునీత లాంటి కళాకారులు అందరికీ ఆదర్శమని వారు మరిన్ని విజయశిఖరాలు అధిరోహించాలని పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతి ఆకాంక్షించారు. పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ఎన్నారైల సహకారంతో విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తామని, నిరుద్యోగ యువతలో నైపుణ్యం పెంపొందించే విధంగా శిక్షణా శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తామని, జిల్లాకు చెందిన కళాకారులను, మేధావులను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామని ఫౌండేషన్‍ సమన్వయకర్త ముప్పా రాజశేఖర్ తెలిపారు. ఓర్వకల్లు మండలం పొదుపులక్ష్మీ ఐక్యసంఘంకు చెందిన పలువురు మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular