రఘురామకృష్ణంరాజు కేసులో ఎక్కడా తమ జోక్యం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సిఐడి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసిందని, చట్టానికి లోబడే ఆయన్ను అదుపులోకి తీసుకుందని సజ్జల చెప్పారు. ఏడాది కాలంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ అరెస్ట్ రాత్రికి రాత్రే జరిగింది కాదని పేర్కొన్నారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన రఘురామ పార్టికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామని సజ్జల వివరించారు.
రఘురామను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారని, అందుకే అయన అరెస్టుపై తెలుగుదేశం గగ్గోలు పెడుతోందని ఆరోపించారు. కొద్ది కాలంగా నర్సాపురం ఎంపి చేసున్న వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని, దీనికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని సజ్జల వెల్లడించారు. రఘురామ రాజుతో చంద్రబాబు, లోకేష్, సుజనా చౌదరి ఏమి మాట్లాడారో చెప్పాలని సజ్జల నిలదీశారు. తన బండారం బైట పడుతుందనే చంద్రబాబు రఘురామకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అరెస్టు తరువాత పాదాలకు గాయాలయ్యాయంటూ కొత్త నాటకానికి తెరదీశారని, నిన్న కారులో హైదరాబాద్ వెళుతూ మీసం మేలేస్తున్నారని, కాలు చూపిస్తున్నారని గుర్తు చేశారు.