Tuesday, April 1, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒరుగుతున్న వరి వెన్ను

ఒరుగుతున్న వరి వెన్ను

Paddy Purchase: Process witnessing inordinate delay

వేస్తే వరి-
కోస్తే ఉరి.

కంటికే వరి-
మెడకు ఉరి.

పంజరంలో వరిగింజలు గింజుకుంటున్నాయి. చేలుదాటిన వరి బస్తాలు కొనుగోళ్లకోసం కుస్తీలు పడుతున్నాయి. కొనుగోలు కోసం గోసపడుతున్నాయి. పండిన మూటలు సిగ్గువిడిచి, దీనంగా, తలదించుకుని క్యూల్లో నిలుచున్నాయి. టోకెన్ల కోసం నిరీక్షిస్తున్నాయి. టోకెన్లు దక్కక వరికుప్పల మీదే గింజలు తలవాలుస్తున్నాయి.

వరి పొట్టు వదిలి, బియ్యమై, అన్నమై మన కంచాల్లోకి రాకుండా అన్నదాతకు విషమవుతోంది. దుక్కి దున్ని, నారు పోసి, నీరు పోసి, గింజ గింజకు ప్రాణం పోసిన రైతు కళ్ల ముందు గింజలు విలువ లేనివయ్యాయి. గింజలు తేలిపోతున్నాయి. వాలిపోతున్నాయి. రాలిపోతున్నాయి.పుడమి కడుపుకు పట్టెడన్నం మెతుకుల పోషకాహారం కావాల్సిన వరి…రైతు పోషించలేని ఫలసాయం అవుతోంది. వరి వ్యవసాయంలో వ్యయమే తప్ప సాయం లేని దైన్యం మిగులుతోంది. వెన్ను వెన్నులో బంగారం గింజలు నింపుకున్న వరి రైతు వెన్ను విరుస్తోంది. వరి కోత కోసిన కొడవలి ఆకారానికి తగినట్లు పెద్ద ప్రశ్ననే మిగిల్చింది.

పంటల విధానమేదో రైతు గుండెల్లో మంట పెట్టింది. అందరికీ అన్నమే కావాలి. రైతుకు మాత్రం సున్నమే మిగిలింది.

నీరవ్ మోడీలు, మాల్యాలు వేల కోట్లు, లక్షల కోట్ల బ్యాంకు రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి విమానాల్లో విహరిస్తుంటే…వ్యవస్థలు చోద్యం చూస్తున్నాయి.

వరి కుప్ప మీద రైతు మరణ సంతకం చేస్తుంటే…మనం ఇంట్లో వేడి వేడిగా అన్నం తింటున్నాం.
వరి మూటకు రైతు ఉరి వేసుకుంటుంటే…మనం డైనింగ్ టేబుల్ మీద అన్నం వడ్డించుకుంటున్నాం.
పండిన ప్రతి గింజలో రైతు ప్రాణం ప్రతిఫలిస్తుంటే…మనం గింజలు తినగలుగుతున్నాం.

వరి ఇప్పుడొక విషాదం.
వరి ఇప్పుడొక ప్రహసనం.
వరి ఇప్పుడొక నిషిద్ధ సేద్యం.
వరి ఇప్పుడొక పెను భారం.

అన్నం వరి బ్రహ్మ స్వరూపం.

మనం కడుపుకు అన్నమే తింటున్నామా!
ఏమో?

-పమిడికాల్వ మధుసూదన్

Must Watch:

Also Read:

రామ రాజ్యం సంభవించే కాలమా ఇది?

Also Read:

బియ్యానికి బి 12 తోడు

Also Read:

కరెంటు వైర్లతో అసువులుబాసే పశువులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్