Anushka Has Unique Qualities Than Other Heroins  :

Anushka proved herself as an great artist with different roles…
అందాన్ని నిర్వచించడం కష్టం .. అసలైన అందం ఎలా ఉంటుందనే ప్రశ్నకు నిదర్శనాలు చూపడం కష్టం. ఈ విషయంపై ఆలోచిస్తూ కాలయాపన చేయడం కన్నా, అనుష్కను చూపిస్తే
సరిపోతుందని చెప్పచ్చు. ఆకాశాన్ని రెప్పలా మధ్య దాచేసే విశాలమైన కళ్లు .. కుర్రాళ్ల మనసులను మంత్రించే చూపులు .. కాడమల్లే పూవు లాంటి నాసిక .. ఇంధ్రధనుస్సును వంచినట్టుగా కనిపించే పెదవులు .. మనసు మైదానంలో ఆశల జలపాతాన్ని కురిపించే మందహాసం  అనుష్క సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అందం పెట్టుకున్న పేరే అనుష్క.

తెలుగు సినిమా అడుగులు మార్చి .. నడకలు నేర్చి  .. పరుగులు తీస్తూ సాగిస్తున్న ఈ ప్రయాణంలో, ఎంతోమంది అందమైన కథానాయికలు తెరకి పరిచయమయ్యారు. అలా పరిచయమైన వారిలో కూడా అగ్రస్థానానికి కొందరే చేరుకున్నారు. అలా చేరుకున్నవారిలో అతి తక్కువమందే అరుదైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ అతికొద్ది మందిలో అనుష్క ఒకరని నిస్సందేహంగా చెప్పచ్చు. మంగుళూరులో పుట్టి పెరిగిన అనుష్క .. ముంబైలో భరత్ ఠాకూర్ దగ్గర యోగా నేర్చుకున్నారు. ఆ తరువాత యోగా టీచర్ గానే తన కెరియర్ ను మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

అనుష్కకు సినిమాల పట్ల కూడా ఆసక్తి ఉందని గ్రహించిన భరత్ ఠాకూర్ కి, పూరి ‘సూపర్’ సినిమాకి గాను కొత్త హీరోయిన్ కోసం వెదుకుతున్నట్టుగా కామన్ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. దాంతో ఆయన అనుష్కను పూరి దృష్టికి తీసుకువెళ్లారు. అలా ఆమె పూరి కంట్లో పడ్డారు. అప్పటివరకూ ఆమెకి సినిమా ప్రపంచం గురించి ఎంతమాత్రం తెలియదు. పూర్తి తనని ఫొటో అడిగితే .. వెంటనే  తన హ్యాండ్ బ్యాగులో నుంచి పాస్ పోర్టు సైజ్ ఫోటో తీసి ఇచ్చినట్టుగా ఒక ఇంటర్వ్యూ లో ఆమెనే చెప్పి నవ్వేశారు. దీనిని బట్టి ఎంట్రీకి ముందు సినిమా ఫీల్డ్ గురించిన అవగాహన ఆమెకి ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

అలా పూరి దర్శకత్వంలో నాగార్జున సరసన నాయికగా ‘సూపర్’ సినిమాతో ఆమె 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో అనుష్కను చూసిన కుర్రాళ్లు ఇంతకుమించిన అందాన్ని ఇంతవరకూ చూడలేదనుకున్నారు. ఆ క్షణమే ఆమెకి అభిమానులైపోయారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా .. ఆ వెంటనే ఆమెకి ‘మహానంది’ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా ఫరవాలేదనిపించుకుంది. రాజమౌళి కంట్లో పడిన ఆమె, ‘విక్రమార్కుడు’ సినిమాతో తొలిసారిగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో పౌర్ణమి నాటి జాబిల్లిలా ఆమె అందం మరింత వెలుగులోకి వచ్చింది.

ఇక అప్పటి నుంచి అనుష్క వెనుదిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోల జోడీగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. అదే సమయంలో తమిళంలోను స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నారు. తెలుగులో చిరంజీవి (స్టాలిన్ – స్పెషల్ సాంగ్) బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ .. రవితేజ .. ప్రభాస్ .. మహేశ్ బాబులతో సినిమాలు చేసిన ఆమె, తమిళంలో రజనీ .. విక్రమ్ .. సూర్య .. కార్తి .. శింబు .. ఆర్యతో కలిసి తన జోరును చూపించారు. కొన్ని పరాజయాలు ఎదురైనా ఆమె క్రేజ్ పై అవి అంతగా ప్రభావం చూపలేకపోయాయి.

ఇక ‘అరుంధతి’ సినిమా అనుష్క కెరియర్ ను మలుపుతిప్పేసింది. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘అరుంధతి’గా .. ‘జేజెమ్మ’గా అసమానమైన నటనను ప్రదర్శించి ఆశ్చర్యచకితులను చేశారు. నాయిక ప్రధానమైన కథలకు ఒక అద్భుతమైన నటి దొరికిందనే విషయం ఇండస్ట్రీకి అర్థమైపోయింది. అందువల్లనే ఒక ‘రుద్రమదేవి’ .. ఒక ‘భాగమతి’ వంటి విజయాలు ఆమె ఖాతాలోకి చేరిపోయాయి. ఇక అనుష్క కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచపటానికి పరిచయం చేసిన సినిమాలుగా ‘బాహుబలి’ .. ‘బాహుబలి 2’ కనిపిస్తాయి.

‘బాహుబలి’ సినిమాలో ‘దేవసేన’గా ఆమె అభినయం గురించి చెప్పుకోవడానికి మాటలు చాలవు. ఒక వైపున ప్రభాస్ .. రానా .. మరో వైపున రమ్యకృష్ణ – సత్యరాజ్. ఈ నలుగురి కాంబినేషన్లోని సన్నివేశాల్లో ఆమె పోటీపడి నటించారు .. దేవసేన పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఆ పాత్రలో ఒదిగిపోయారు. తెలుగులో అనుష్కకు ముందు .. ఆ తరువాత కూడా చాలామంది అందమైన కథానాయికలు తెరపై సందడి చేశారు. కానీ జానపద .. పౌరాణిక పాత్రలకి సైతం సరిగ్గా  సరిపోయే రూపం అనుష్క సొంతం అని చెప్పక తప్పదు.

అనుష్కతో పనిచేసినవారెవరైనా ఆమె మంచి నటి మాత్రమే కాదు, అంతకంటే మంచి మనసున్న మనిషి అనే చెబుతారు. తాను ఒక స్టార్ హీరోయిన్ ను అనే అహంభావాన్ని అనుష్క ఎప్పుడూ దగ్గరికి రానీయలేదు. ఎప్పుడూ ఎవరి మనసును కష్టపెట్టేలా ప్రవర్తించిన దాఖలాలు లేవు. దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడమనేది ఆమెకి తెలియనే తెలియదు. అందువల్లనే సాధారణ ప్రేక్షకులలోనే కాదు, ఇతర హీరోలు .. హీరోయిన్లలోను ఆమెకి అభిమానులు ఉన్నారంటే అనుష్క ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున ఆమె పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తూ, మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

—  పెద్దింటి గోపీకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *