Amit Shah welcomed:
రేపు నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అమిత్ షా కు సిఎం తో పాటు డిప్యుటీ సిఎం కె. నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి మేయర్ శిరీష, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డిజిపి గౌతమ్ సావాంగ్ తదితరులు కూడా ఉన్నారు. రేణిగుంట నుంచి నేరుగా తిరుమలకు బయల్దేరి వెళ్ళారు. శ్రీవారి దర్శనం అనంతరం రాత్రికి తిరుపతి చేరుకొని తాజ్ హోటల్ లో బస చేస్తారు.
రేపు ఉదయం వైమానిక హెలికాఫ్టర్ లో నెల్లూరు చేరుకొని స్వర్ణ భారతి ట్రస్ట్ 20వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం తిరిగి తిరుపతి తాజ్ హోటల్ కు చేరుకొని సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రికి అదే హోటల్ లో బస చేసి సోమవారం ఉదయం మరోసారి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం తిరుపతి చేరుకొని రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీ కి బయల్దేరి వెళతారు.