Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు

మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు

Carona Crises-Human Relations:
నెలకి నలభైవేలలోపు జీతగాడు ప్రశాంత్ కి కరోనా సోకింది.

అష్టకష్టాలూ పడి, అప్పులు చేసినా బతకలేదు.
ఏడాది కూతురుతో సహా ఆయన భార్య సంధ్య.. తన అమ్మగారింటికి చేరింది.
కానీ, భర్త చనిపోయిన పదిహేను రోజులకే ఆయన క్రెడిట్ కార్డ్ బిల్లులు వచ్చాయి.
లక్షలకు లక్షలు డ్రా చేసినట్టున్నాయి.
ప్రశాంత్ ఆస్పత్రిలో వున్న టైమ్ లో ఖర్చులన్నీ అతని తమ్ముడు అజయ్ చూసాడు.
అయితే, ఇందులో ఎంత నిజంగా ఆస్పత్రికి కట్టాడో.. ఎంత అతను సొంతంగా వాడుకున్నాడో లెక్కలు లేవు.
సంధ్య లెక్కలడిగితే, ఇంకా నువ్వే మరో పదిలక్షలివ్వాలని చెప్పాడు.
మొన్నటి దాకా అన్న బతకాలని అహర్నిశలూ ఆస్పత్రిలోనే గడిపాడతడు.
ఇప్పుడు సంధ్యకి విలన్ గా మారిపోయాడు.
అస్పత్రిలో వున్న అన్న అసహాయతని కూడా క్యాష్ చేసుకునే దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు.
ఆ అన్నదమ్ముల కుటుంబాలు ఇప్పుడు బద్ధ శత్రువులు..

ఒంగోలు ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన ఓబులేశు కుటుంబం ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుని బతికేది.
ముగ్గురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబంలో ఓబులేశు రెండోవాడు.
భర్త చనిపోయాక, ఓబులేశు భార్య ఆ ఇంటిలో ఓంటరిదైంది. తన వాటా భూమి తనకిచ్చేస్తే వెళ్ళిపోతానంది.
ఓబులేశు ట్రీట్ మెంట్ కోసం చేసిన అప్పుల సంగతేంటని అడుగుతున్నారు.. అన్నదమ్ములు.
ట్రీట్ మెంట్ కీ, ఆమెకి రావాల్సిన వాటాకి చెల్లన్నారు.
ఊళ్ళో పెద్ద గొడవ, పెద్దమనుషుల పంచాయితీ.. పోలీసులు కేసులు.
నిన్నటి దాకా ముగ్గురన్నదమ్ములని కలిసికట్టుగా చూసిన ఆ ఇల్లు .. ఇప్పుడు ఆస్తికోసం కొట్టుకుంటున్న కుటుంబాన్ని చూస్తోంది.


జర్నలిజం లో పిజి తర్వాత వచ్చిన అసిస్టెంట్ ప్రొఫోసర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని పెద్దింటి సంబంధం చేసుకుంది..పూజ.
ఎక్కడో జమ్మలమడుగు దగ్గర ఒక చిన్న పల్లెటూర్లో పెద్దరెడ్డిగారి కుటుంబానికి కోడలిగా వెళ్లింది.
భర్తకి బదిలీ అయ్యాక, చదువు, ఉద్యోగాలని అటకెక్కించి పదహారేళ్ళుగా ఇంటెడు చాకిరీకే అంకితమైపోయింది.
ఆమె భర్త కూడా మొన్న కరోనాకి బలయిపోయాడు. పదిహేనేళ్ళ కూతురుతో పైసా సంపాదన లేకుండా మిగిలింది. భర్త అన్నదమ్ములెవరూ ఇప్పుడు ఆమె కుటుంబాన్ని ఆదుకోడానికి సిద్ధంగా లేరు.
ఆస్తిపాస్తుల్లో రాతకోతలు జరగలేదు కనుక, ఆమెకి వచ్చేది కూడా ఏమీ కనిపించడంలేదు.
ఇటు అమ్మగారి ఇంటి నుంచి అటు అత్తగారి ఇంటి నుంచి కూడా పైసా మద్దతు లేని పరిస్థితుల్లో చివరి ఆశగా కోర్టు మెట్లెక్కాలనుకుంటోంది.
…….
ఇవి నాకు తెలిసిన మూడు జీవితాలు..
ఇలాంటివి ఊరుకెన్ని వున్నాయో ఊహకి కూడా అందదు.
పోయిన ప్రాణాలకు లెక్కలుండొచ్చు.
కూలిపోయిన కుటుంబాలకూ లెక్కపెట్టొచ్చు..
కానీ, బతికున్నా..మనుషులుగా చచ్చిపోయిన వాళ్ళకి ఏ లెక్కా లేదు.
ఆస్తుల కోసం, అస్పత్రి ఖర్చుల కోసం కత్తులు దూసుకుంటున్న అభాగ్యులు ఏ లెక్కలోకీ రారు.
నా అనే దిక్కు లేని,
పోరాడే శక్తిలేని
ఒంటరి పక్షులకు లెక్కే లేదు.


అలా అని మానవత్వం మరీ కనుమరుగైపోలేదు.
అన్నయ్య చనిపోతే.. ఆయన బిడ్డకి అన్నీ తానే అయి పెళ్ళి చేసిన ఒక తమ్ముడి కథ కూడా ఈ మధ్యే విన్నాను.. కాకపోతే.. ఇవి చాలా అరుదు.

(ఇందులో పేర్లు, ఊర్లు మార్చాను)

-శివ

Also Read :

అతి చేస్తే గతి చెడుతుంది

Also Read :

గేదె తంతోంది… అరెస్ట్ చేయండి సార్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్