Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభయమే దయ్యం- ధైర్యమే దేవుడు

భయమే దయ్యం- ధైర్యమే దేవుడు

Courage and Fear:
దయ్యాలు వేదాలు చదవడం నిషిద్ధం. అంటే వేదాలు తప్ప  మిగతావన్నీ చదవచ్చు అని అనుకోవచ్చు.
చదివి చదివి దయ్యాలే అవుతున్నప్పుడు,  చదివిన దయ్యాలుండడం సమసమాజానికి గర్వకారణమేకానీ, భయపడాల్సింది బాధపడాల్సింది ఏమీ లేదు.

అయినా వేదమంతా దేవుళ్ల గురించే చెబుతుంది. దేవుళ్ళకు దయ్యాలకు అసలు పడదుకాబట్టి ఆ మాట పుట్టింది.

అయినా ఉత్తిష్టంతు భూత పిశాచ . . . మంత్రంలో ,

ఆగమానార్థంతు దేవానాం , గమనార్థంతు రాక్షసాం . . కుర్వన్తు ఘంటారావం . . . మంత్రంలో భూత ప్రేత పిశాచాలు రాక్షసులు లేచిపోవడానికి; దేవుళ్లు సాదరంగా లోపలికి రావడానికి అని స్పష్టంగా రోజూ చెబుతూనే ఉన్నాం. అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం. అర్థం తెలిస్తే నాలాగా పిరికివాళ్ళై అనుక్షణం వణికిపోతూ ఉంటారు.

దేవుళ్ల గురించి మాట్లాడ్డానికి సకల వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, మంత్రశాస్త్రాలు చదవాలి కానీ – దయ్యాల గురించి తెలియనిదెవరికి ? పబ్లిక్ డొమైన్ లో ఉన్నదంతా దయ్యాల కథలే .

తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో ? భాషలో దయ్యం ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో ?

ఎన్ని దయ్యం నుడికారాలో ? ఎన్ని దయ్యం సామెతలో ? ఎన్ని తిట్లో ? ఎన్ని దయ్యం పోలికలో ?

దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ , మనం దయ్యాలకు భిన్నంగా ఎలా ఉన్నామో చెప్పాలని నా డిమాండు.

జుట్టు చింపిరి చింపిరిగా ఉన్నా, విరబోసుకున్నా దయ్యంలా ఏమిటి ఆ జుట్టు అంటాం. చింపిరి,  విరబోత ఇప్పుడు ఫ్యాషన్. జుట్టు విరబోసుకున్నవారంతా దయ్యాలని అనగలమా? అంటే అప్పుడు మనుషులే మిగలరు కదా?

ఏక వస్త్రం భుజాల నుండి కాలిగోళ్ళ వరకు వేలాడే డ్రస్సు దయ్యానికి యూనిఫామ్ . మరిప్పుడు అది లేటెస్టు ఫ్యాషన్ కాబట్టి అలా వేసుకున్నవారందరిలో దయ్యాలను వెతకలేం కదా?

కాళ్ళు వెనక్కు ఉండడం దయ్యం అనాటమీ. సమాజం మనోవేగ తిరోగమనంలో వెనక్కే నడుస్తోంది కాబట్టి మనవి దయ్యం కాళ్ళు అంటే ఒప్పుకుంటామా? పీక్కు తినడం దయ్యం పధ్ధతి. మనమిప్పుడు అంతకంటే భిన్నంగా తింటుంటే నా తెలివిలేమిని మన్నించగలరు. పిచ్చిగా ఊగడం , వణకడం దయ్యం స్వభావం . మనం తూగి ఊగి వణకడానికి ఎన్నెన్నో పదార్థాలను కోరి కోరి తీసుకుంటున్నాం. రాత్రిళ్లు తిరగడం దయ్యం స్టయిల్. మనకిప్పుడు రాచకార్యాలన్నీ రాత్రిళ్లే. దయ్యం కాళ్లు భూమిని తాకవు. మనకాళ్లు భూమిని తాకడం మానేసి యుగాలు అవుతోంది.

మంచి దయ్యాలు, చెడ్డ దయ్యాలు ఒక విభజన. పిల్ల దయ్యాలు, కొరివి దయ్యాలు మరొక విభజన. వింత దయ్యాలు, మొండి దయ్యాలు ఇలా స్వభావాన్నిబట్టి ఇంకా చాలా దయ్యాలుంటాయి. అయితే యు ఐ డి ఆధార్ ఎన్రోల్ మెంట్ సరిగ్గా జరక్కపోవడంవల్ల దేశవ్యాప్తంగా దయ్యాల సంఖ్య మీద స్పష్టత లేదు. దయ్యానికి పనిచెప్పడం చాలా కష్టమని ప్రసిద్ధకథ. అంటే దయ్యాలతో పనిచేయించుకోవడానికి ఎవరో ప్రయత్నం చేశారన్నమాట.

ఒకప్పుడు ఊరికి ఉత్తరాన స్మశానంలో సమాధులను అరుగులుగా చేసుకుని చీకటి పడ్డాక దయ్యాలు నిద్రలేచేవి. ఇప్పుడు స్మశానాలన్నీ ఊళ్లో కలిశాక దయ్యాలకు రాత్రి పగలు తేడా తెలియక చస్తున్నాయి.

చీకటి, ఒంటరిగా ఉంటే మనపక్కన దయ్యాలే తోడు ఉన్న అనుభూతి కలుగుతుంది.

తెలుగు సినిమాల్లో దయ్యాలను హీరో – హీరోయిన్లను చేసిన విఠలాచార్యకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో తెలియక ఇప్పటికీ దయ్యాలు జుట్లు పీక్కుంటున్నాయి. మన జానపద కథలనిండా దయ్యాలే దయ్యాలు . దయ్యానికి శరీరం లేక మన శరీరాలను అద్దెకు తీసుకుంటాయి. మన భాషే మాట్లాడతాయి. కానీ దెబ్బకు దయ్యం దిగిపోవాల! అని భూత వైద్యుడు కొడితే దెబ్బలు మాత్రం మనకే తగులుతాయి . దయ్యాలతో మాట్లాడే నిపుణులు ఉంటారు. ఆ భాష , దాని వ్యాకరణం, నిఘంటువులు ఏ స్మశానంలో దొరుకుతోయో రహస్యం. అందుకే శ్రీ శ్రీ ప్రతీకాత్మకంగా శ్మశానాల నిఘంటువుల సంకెళ్లు తెంచుకుని అన్నాడేమో?

టీవీ యాంకర్ల భాష మీద కూడా ఇలాంటి ముద్రలేవో ఉన్నాయి కానీ ఆ వివరాల్లోకి వెళ్లడం సభా మర్యాదకాదు.

దయ్యం తిండి అని ఏనాడూ తిండి తినని దయ్యాన్ని తిట్టుకు వాడుకుంటున్నాం.

మనలోపలే కనపడని దయ్యాలుంటాయి. మనకు కనపడవు కానీ, ఎదుటివారికి మనలో దయ్యం కొట్టొచ్చినట్లు, మింగడానికి వచ్చినట్లు, మీద పడుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.

చచ్చి దయ్యలయిన వాటికి యూనిఫామ్ పధ్ధతి పాడు ఉంటుంది.  జీవించి ఉన్న దయ్యాలను గుర్తించినవాడే నిజమయిన భూత వైద్యుడు.

చీకటి భయం ,
అజ్ఞానం భయం ,
భయమే దయ్యం .
వెలుగు ధైర్యం ,
జ్ఞానం ధైర్యం ,
ధైర్యమే దేవుడు .

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : యాంగర్ మేనేజ్ మెంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్