హైదరాబాద్ లో లాక్ డౌన్ అమలు తీరును డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. కూకట్ పల్లి వై జంక్షన్, జేఎన్టియూ చౌరస్తాల్లో వాహనాల తనిఖీ చేస్తున్న తీరును దగ్గరుండి పరిశీలించారు. ముఖ్యమంత్రి కెసియార్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
మరోవైపు జంట నగరాలలోని మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసులు లాక్ డౌన్ అమలును కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలని సీజ్ చేస్తున్నారు. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ పేరిట చాలామంది యువకులు బుకింగ్ ఆర్డర్ లేకపోయినా టీ షర్టులు ధరించి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఐడి కార్డులు, ఆర్డర్ డెలివరీ రశీదులు చూపించని వాహనాలను తిప్పి పంపుతున్నారు.
నిన్న వరంగల్ లో పర్యటించిన సిఎం కెసిఆర్ అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నేపధ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఉదయం 9 గంటల నుంచే రంగంలోకి దిగి ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రజలకు వెసులుబాటు కల్పించిన సమయం (ఉదయం 6 నుంచి 10గంటలు) తర్వాత బయట తిరుగుతున్న ప్రతి ఒక్కరినీ ఆపి తనిఖీలు చేసి విచారిస్తున్నారు. సరైన కారణం లేని వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు.