Government Failure: Babu
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడూ చెప్పిరావని, అవి వచ్చినప్పుడు, వాటిని ధీటుగా ఎదుర్కొన్నప్పుడు మాత్రమే ప్రభుత్వ సమర్ధత తెలుస్తుందని వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు, వరదలపై వాతావరణ శాఖ పలు సూచనలు చేసినా ఫ్రభుత్వం పట్టించుకోలేదని బాబు ఆరోపించారు. సిఎం, మంత్రులు వారి అనుభావరాహిత్యం ప్రజలకు శాపంగా మారిందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా సహాయక చర్యలను ముమ్మరం చేయలేకపోయారని విమర్శించారు. పార్టీ నేతలతో కలిసి రేణిగుంటలో మీడియా సమావేశంలో బాబు మాట్లాడారు.
రెండురోజులుగా కడప, తిరుపతిలోని ముంపుప్రాంతాల్లో పర్యటించానని, చెన్నై వర్షాల ప్రభావం కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరుపై పడిందని చెప్పారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారని, డ్యామ్ లలో వరదనీరు వస్తున్నా ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని బాబు ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లు పెట్టేందుకు ఈ ప్రభుత్వం కనీసం డబ్బులు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. రాయల చెరువు సమీప ప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో వణికిపోయారని, వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని బాబు వాపోయారు. కనీసం మృతదేహం కూడా దొరకలేదంటే ప్రభుత్వం తీరు అర్ధమవుతోందన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో తేలాల్సిన అవసరం ఉందని, అందుకే దీనిపై జ్యుడిషియల్ విచారణ కోరుతున్నామని చెప్పారు. తుమ్మల గుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాలని, కపిల తీర్ధం నుంచి వచ్చే వరద స్వర్ణముఖి నదికి చేరేలా కాలువ నిర్మాణం చేపట్టాలని బాబు సూచించారు. వరదల్లో 60 మందికి పైగా చనిపోయారని, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హూదూద్ తుఫాన్ సమయంలో తాను చేపట్టిన చర్యల్లో కొన్నింటినైనా చేయలేకపోయారని బాబు అన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమర్ధంగా వ్యవహరిస్తే ప్రాణ నష్టం తగ్గించవచ్చని, కానీ తమకు ఎలాంటి తుఫాను హెచ్చరికలు అందలేదని ప్రజలు చెబుతున్నారని బాబు వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 40 వేల మందికి సాయం చేశామని, కానీ ప్రభుత్వ క్యాంప్ లు ఎక్కడా కనబడలేదని విమర్శించారు.
Also Read : సిఎం జగన్ తో బీసీ నేతల భేటి