Monday, May 20, 2024
Homeసినిమాశివ శంకర్ మాస్టర్ కన్నుమూత

శివ శంకర్ మాస్టర్ కన్నుమూత

Shiva Shankar Master died:
ప్రముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఇక లేరు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ ఈరోజు రాత్రి 8 గంట‌ల‌కు తుది శ్వాస విడిచారు. 1975లో పాట్టు భరతమమ్‌ చిత్రానికి సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించారు. ఆత‌ర్వాత‌ ఆయన కురువికూడు చిత్రంతో కొరియోగ్రాఫ‌ర్ గా మారారు. తెలుగు, తమిళ చిత్రాలతో సహా 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన నృత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా వెండితెర పైనా తనదై ముద్రవేశారు. 2003లో వచ్చిన ఆలయ్ చిత్రంతో నటుడిగా మారిన శివ శంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో వైవిధ్య నటనతో నవ్వులు పంచారు. శివశంకర్‌ మాస్టర్‌కు మెరుగైన వైద్యం అందించడానికి ఇటీవ‌ల‌ చిరంజీవి, సోనూసూద్‌, ధనుష్ లు తమ వంతు సాయం చేశారు. అయిన‌ప్ప‌టికీ మాస్టర్‌ ప్రాణాలు దక్కలేదు. ఆయన ఇక లేరన్న వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివశంకర్ మాస్ట‌ర్ మృతి పట్ల పలువురు సినీ ప్ర‌ముఖులు విచారం వ్యక్తం చేసి ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.

డిసెంబర్ 7, 1948లో ఓ నిరుపేద కుటుంబంలో శివశంకర్ జన్మించారు. అయన తండ్రి పండ్ల వ్యాపారిగా ఉండేవారు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగారు. డ్యాన్సు పై మక్కువతో అయన అదే రంగాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. సలీం మాస్టర్ వద్ద సహాయకుడిగా అనేక మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాతి కాలంలో దక్షిణ బారత చలన చిత్ర రంగంలో కొరియోగ్రఫీకి మారుపేరుగా నిలిచారు.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘మగధీర’ సినిమాలో అయన నృత్య దర్శకత్వం వహించిన ‘ధీర ధీర’ పాటకు గాను అయన 2011 సంవత్సరానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ గా  జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. అమ్మోరు, బాహుబలి, సూర్య వంశం, మహాత్మా చిత్రాలకు కూడా అయన నృత్యం రీతులు సమకూర్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్