తన కళ్ళముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంత్రి కాన్వాయ్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో ముదిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాస్ (36) బాలానగర్ నుంచి సొంతూరుకు బైక్ పై వస్తున్నాడు.
హైదరాబాద్ నుంచే కర్ణాటక వెళ్తున్న బొలెరో వాహనాం రాజాపూర్ శివారులో బైక్ ను ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు అటుగా వస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకుపోమని డ్రైవర్‌ను ఆదేశించారు. ఆక్సిడెంట్ చేసి పరారవుతున్న కర్ణాటకకు చెందిన బొలెరోను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
బైక్ ను ఢీకొట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిన బొలెరో వాహనాన్ని ఛేజ్ చేసి 3 కి.మీ లోపే పట్టుకున్నారు. మంత్రి వాహనాన్ని అడ్డంగా పెట్టి బొలెరో వాహనాన్ని ఆపారు. అనంతరం డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గాయపడిన శ్రీనివాస్ ను రాజాపూర్ పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స చేసి మహబూబ్ నగర్‌కు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు పంపించారు. తన కండ్ల ముందే ప్రమాదాన్ని చూసి వెంటనే మానవత్వంతో స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వల్లే బాధితునికి వెంటనే చికిత్స అందింది. తప్పుచేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారని స్థానికులు తెలిపారు. మంత్రి సాయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.