మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో భేటి అయినట్లు వస్తున్న వార్తలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు. తనను కలిసేందుకు ఈటెల సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే ఇంకా కలవలేదని వివరించారు.
ఈటెల, తాను 15 ఏళ్ళు శాసనసభ్యులుగా కలిసి పనిచేశామని, ఎప్పుడైనా కలుసుకుంటే తప్పులేదని వ్యాఖ్యానించారు. కలిసినంత మాత్రాన పార్టీలో చేరేందుకు అనుకోలేమన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ కి ఉప ఎన్నిక వస్తే అప్పుడు పోటీ చేయాలా వద్దా అనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బిజెపి కేంద్ర నాయకత్వం ఆదేశాలతో కిషన్ రెడ్డి, బిజెపి కీలక నేత భూపేంద్ర యాదవ్ లు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చి ఈటెల రాజేందర్ తో రహస్యంగా సమావేశమైనట్లు వార్తలొచ్చాయి. బిజెపిలో ఈటెలను చేర్చుకునేదుకు మంతనాలు జరిపినట్లు సమాచారం.