AP CM grief:
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని జల్లేరువాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందడంపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపిన సిఎం, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. 9 మంది ప్రమాద స్థలిలోనే మృత్యు వాత పడ్డారు. క్షతగాత్రులను జంగారెడ్డి గూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.
కాగా, ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నాని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం జగన్ ఆదేశించారని నాని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాద ఘటనకు అయన బయల్దేరారు.
Also Read : ‘పశ్చిమ’ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం