PRC may be on Monday:
ఉద్యోగులకు 34శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కరోనా వల్ల ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, అందుకే ఉద్యోగ సంఘాలు కోరిన స్థాయిలో ఫిట్మెంట్ ఇవ్వడం కుదరడం లేదని, పరిస్థితులు బాగుంటే తప్పకుండా వారి డిమాండ్లను పూర్తి స్థాయిలో తీర్చేందుకు వీలు ఉండేదని పేర్కొన్నారు. సిఎం జగన్ ఉద్యోగుల పట్ల సానుకూలంగానే ఉంటారని, కానీ కరోనా సంక్షోభం వల్లే వారి డిమాండ్ మేరకు జీతాల పెంపు చేయలేకపోతున్నామని సజ్జల అన్నారు.
ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సమావేశం అయ్యే అవకాశం ఉందని, ఒకవేళ రేపు వీలు కాకపొతే సోమవారం భేటీ అవుతారని, ఈ సమావేశం తరువాతే పీఆర్సీ ప్రకటన ఉంటుందని సజ్జల స్పష్టం చేశారు. సిఎం జగన్ తో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తాను జరిపిన చర్చల సారాంశాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఉద్యోగ సంఘాల అపోహలు తొలగించే ప్రయత్నంపై చర్చ జరిగిందన్నారు.
ఇప్పుడున్న జీతాలు తగ్గకుండా ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇస్తామని సజ్జల హామీ ఇచ్చారు. బకాయి ఉన్న డీఏలపై కూడా సిఎంతో చర్చించామన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున ఉద్యమ కార్యాచరణ విరమించాలని కోరామని సజ్జల తెలియజేశారు. సిఎస్ తో ఈ విషయమై చర్చిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారన్నారు. ఈరోజు సిఎస్ తో నేతలు సమావేశమవుతారని సజ్జల చెప్పారు. తమ డిమాండ్లపై నిర్ధిష్ట కాలపరిమితి తో కూడిన హామీ కావాలని సంఘాలు కోరుతున్నాయని, ఇదే విషయాన్ని సిఎంకు చెప్పామని సజ్జల వివరించారు.
Also Read : ముందస్తు ప్రభుత్వ హెచ్చరిక