Prabhas – down to earth: ప్రభాస్ ఒక పేరు కాదు .. ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఇటు ఇండస్ట్రీ .. అటు అభిమాన లోకం ఇష్టంతో జపించే మంత్రంగా మారిపోయింది. ఆయన సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల బిజినెస్ అన్నట్టుగా ఎదిగిపోయింది. అలాంటి ప్రభాస్ తో కలిసి పనిచేసిన వాళ్లంతా ఆయన అభిమానులుగా మారిపోతూ ఉంటారు. అందుకు కారణం ఆయన మంచి మనసేనని చెబుతుంటారు. ముఖ్యంగా భోజనం విషయంలో ఆయన అభిమానాన్ని తట్టుకోవడం కష్టమని అంటారు. ‘రాధే శ్యామ్’ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేసిన రాధాకృష్ణ కుమార్ కూడా అదే మాట చెప్పారు.
‘రాధే శ్యామ్’ సినిమా షూటింగు సమయంలో నేను ప్రభాస్ ని చాలా దగ్గరగా చూశాను. తన స్టార్ డమ్ ను పక్కన పెట్టేసి ఆయన అందరితో చాలా కలుపుగోలుగా ఉంటారు. లైట్ బాయ్స్ దగ్గర నుంచి అందరినీ ఒకేలా ఆత్మీయంగా పలకరించడం నిజంగా చాలా గొప్ప విషయం. చూడటానికి ఆయన చాలా రఫ్ గా కనిపిస్తారు గానీ, చాలా సెన్సిటివ్ అనే విషయం నాకు అర్థమైపోయింది. తన కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే ఆయన తట్టుకోలేడు. వాళ్లతో సమానంగా ఆయన కూడా బాధపడతాడు. తాను హ్యాపీగా ఉండాలని మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్నవాళ్లంతా హ్యాపీగా ఉండాలని కోరుకునే గొప్పవ్యక్తి ఆయన.
ఇంత స్టార్ డమ్ వచ్చిన తరువాత ప్రభాస్ లవ్ స్టోరీ చేయడమేంటి? అని చాలామంది అన్నారు. అలాంటి వాళ్లంతా ఈ సినిమా చూసిన తరువాత తమ అభిప్రాయం మార్చుకుంటారు. ఈ కథను ప్రభాస్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాశాను. ఇక పూజ హెగ్డే తారసపడిన తరువాత కథానాయికగా ఆమె అయితే బాగుంటుందని అనిపించింది. అంతేగానీ .. ఆమెను ముందుగా అనుకోవడమేది జరగలేదు. కరోనా సమయంలో మేమంతా విదేశాల్లో చిక్కుబడ్డాం. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ ఖాళీగా ఉండటం చూశాం. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా కరోనాతో బాధపడ్డాం. అంతగా మేము పడిన కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని భావిస్తున్నాము” అని చెప్పుకొచ్చాడు.