attacks on NTR Statues: రాష్ట్రంలో రెండుచోట్ల జరిగిన ఎన్టీఆర్ విగ్రహాలపై దాడి ఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడి కుమారుడు సుత్తితో పగల గొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని విగ్రహానికి భద్రత కల్పించారు. నిన్న తాడేపల్లిలో మరో సంఘటనలో ఎన్టీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వారు.
ఈ సంఘటనలపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్వేషంతోనే ఇలాంటి దుశ్చర్యలకు దిగుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు, ప్రతిపక్షం మీద కాకుండా దేవతా మూర్తులు, మహనీయుల విగ్రహాలపై కూడా దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం తో వైసీపీ తన రాజకీయ పతనాన్ని తానే కొని తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై లక్ష్మీ పార్వతి నోరు విప్పాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. వైసీపీలోనే కొనసాగుతున్న ఆమె ఈ దుశ్చర్యపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ. టిడిపి సీనియర్ నేతలు, బిజెపి ఎంపీ జీవీఎల్ తదితరులు కూడా ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలను ఖండించారు.
మరోవైపు, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు దుర్గి ఘటనను ఖండించారు. ఇది దురదృష్టకర సంఘటనగా అభివర్ణించారు. ఇలాంటి వాటిని వైసీపీ ఎన్నడూ ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు. పార్టీపరంగా ఖండించామని, ప్రభుత్వ పరంగా కూడా స్పందించి బాధ్యులపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. వైసీపీ ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయబోదన్నారు. ఎన్టీఆర్ నే విధ్వంసం చేసి దెబ్బతీసిన వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యాఖ్యానించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ విగ్రహాలను తొలగించారని, అవమానం చేశారని గుర్తు చేశారు.
ఎన్టీ రామారావు అంటే అందరికీ గౌరవమేనని, ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తోందని, ఇది దురదృష్టకరమని మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
15 ఏళ్ళు నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తిని మాచర్ల నియోజకవర్గానికి కొత్త ఇన్ ఛార్జ్ గా తెలుగుదేశం నియమించిందని, ఆయనకున్న ఫ్యాక్షన్ నేపథ్యంతో భయబ్రాంతులకు గురిచేసి శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని చూస్తున్నారని పిన్నెల్లి ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే సదరు వ్యక్తిని అతని తండ్రే పోలీసులకు అప్పగించారని వెల్లడించారు. పోలీసులు తక్షణమే కేసు నమోదు చేశారని వివరించారు.
Also Read : తెలుగు తెరపై ఎదురులేని రారాజు .. ఎన్టీఆర్