పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉందని, అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ఉన్నామన్నారు. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై జలవనరులశాఖ అధికారులతో సీఎం వైయస్ జగన్ సమీక్ష. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమావేశంలో సమగ్రంగా వివరించారు అధికారులు.
పోలవరం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అని సిఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్ డ్యాంకు సంబంధించిన మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారునలు ఆదేశించారు. ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరి కాదని అభిప్రాయపడ్డారు. అధికారులు వెంటనే దీనిపై దృష్టి పెట్టి వెంటనే రీయింబర్స్ అయ్యేలా చూడాలని సూచించారు. వచ్చే మూడు నెలల కాలానికి కనీసం రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినందున డిల్లీ వెళ్లి వెంటనే పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. .
ప్రాజెక్టు ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు
స్పిల్‌వే కాంక్రీట్ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్ 15 కల్లా మిగిలిన పనులు పూర్తి చేస్తామని అధికారులు సిఎంకు వివరించారు. రేడియల్ గేట్లలో 42 బిగించగా, ఇంకా 6 పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా బిగిస్తామన్న తెలిపారు. జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్ సిలిండర్లు కూడా త్వరలోనే ఇక్కడికి చేరనున్నాయని చెప్పారు. ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తిపెట్టి రాబోయే వరద నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెలాఖరు కల్లా స్పిల్ ఛానల్ పనులు సేఫ్ స్టేజ్ దశకు చేరుకుంటాయని వెల్లద్చిన అధికారులు ఎగువ కాఫర్ డ్యాంలో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు, వాటికి సంబంధించి సంక్లిష్టమైన పనులను పూర్తి చేశామన్నారు. కాఫర్ డ్యాంలోని అన్ని రీచ్‌లను జూన్ నెలాఖరు నాటికి 38 మీటర్ల ఎత్తుకు, అలాగే జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో పెంచుతామని సీఎంకు వివరణ ఇచ్చారు .