ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ తుది నివేదిక ఇవ్వలేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అధ్యక్షతన తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో కోవిడ్ పై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అయుష్ నివేదిక వచ్చిన తరువాత ఏమి చేయాలనేదానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
చిత్తూరు జిల్లాకు ఉన్నప్రత్యేక పరిస్థితి దృష్ట్యా లాక్ డౌన్ సడలింపు సమయాన్ని ఉదయం 6 నుంచి 10 గంటల వరకే కుదిస్తున్నామని చెప్పారు. జిల్లాకు వచ్చేవారు సరిహద్దుల వద్ద కోవిడ్ పాజిటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందని, లేని పక్షంలో అక్కడే పరీక్ష నిర్వహించి నెగెటివ్ వస్తే లోపలకు అనుమతిస్తామని చెప్పారు.కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని, వ్యాక్సిన్, ఆక్సిజన్ సరఫరా విషయంలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదయ్యాయని, అందుకే మరికొన్ని రోజులపాటు ఆంక్షలు కతినంగా అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి గౌతం రెడ్డి చెప్పారు. జూన్ 1 నుంచి 15 రకూ ఆంక్షలు కొనసాగిస్తామని ప్రకటించారు.