కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే హెచ్చరికల నేపథ్యంలో పిడియాట్రిక్ కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఎపిఎంఎస్ఐడిసి) చంద్ర శేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మందితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి నిబంధనలు అమలు చేయాలనే అంశాన్ని టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుంది, కరోనా చికిత్స విషయంలో సిబ్బందికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలనే దానిపై కూడా కమిటీ పరిశీలించి నివేదిక తయారు చేస్తుంది.
చిన్న పిల్లలకు కోవిడ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఎవరైనా వైరస్ బారిన పడితే వారికి ఎలాంటి చికిత్స ఇవ్వాలి, ఏయే మందులు అందుబాటులో ఉంచాలనే అంశాలపై ఈ కమిటి ఓ సమగ్ర నివేదిక రూపొందిస్తుంది. ఈ కమిటీని వారంరోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా కోరామని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు.