A Man with Passion and Dignity: జీవితంలో ఎదగాలంటే కసి .. కృషి రెండూ ఉండాలి. ఆవేశమనేది ఆశయంతో ముడిపడి ఉండాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని చేరుకోవడానికి ఎన్ని కష్టాలనైనా పడాలి. ఎన్ని ఆటుపోట్లనైనా .. అవమానాలనైనా ఎదుర్కోవాలి. అంకితభావం ఉన్నవారు అలిసిపోరు .. ఓర్పు తెలిసినవారు ఓడిపోరు. జీవితమంటే పరిగెత్తడమే అనుకుంటారు చాలామంది .. కానీ ఎటు పరిగెత్తుతున్నామనేదే ముఖ్యమనే విషయాన్ని గ్రహించేది కొంతమందే. ఆ కొంతమందే విజయానికి ప్రతీకలుగా నిలుస్తారు .. విజేతలుగా నిలుస్తారు. అలాంటివారిలో ఎల్వీ ప్రసాద్ ఒకరు.
కష్టం అంటే ఏమిటి? నిస్సహాయులుగా నిలబడిపోవడమనేది ఎలా ఉంటుంది? ఒంటరితనం .. ఓటమితనం ఒకేసారి ఎదురైనప్పుడు ఎలా అనిపిస్తుంది? అవమానం మనసుకి ఎంతటి బాధను కలిగిస్తుంది? వీటన్నింటీని గురించి రాసుకుంటూపోతే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. కానీ వాటన్నింటినీ ఎదురిస్తూ వెళితే అది ఎల్వీ ప్రసాద్ జీవితం అవుతుంది. అవును .. జీవితంలో ఎదగాలంటే అందుకోసం ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది, ఎంతగానో పోరాడవలసి ఉంటుందనడానికి ఆయన జీవితమే ఒక నిదర్శనం. ఆయన అనుభవాలను పాఠాలుగా చదువుకుంటే చాలు.
ఎల్వీ ప్రసాద్ పూర్తిపేరు ‘అక్కినేని లక్ష్మీవరప్రసాద రావు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో గల ‘సోమవరప్పాడు’ గ్రామంలో జన్మించారు. ఊహతెలిసిన దగ్గర నుంచి కూడా ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ చుట్టుపక్కల ఎక్కడ నాటకాలు ఆడుతున్నారని తెలిసినా ఆయన అక్కడికి వెళ్లేవారు. ఇక తమ ఊళ్లో వేసే నాటకాలలో చిన్నచిన్న పాత్రలను వేసేవారు. అలా నాటకాలంలో కుదురుకుంటూ ఉండగానే ఆయనకి వివాహం జరగడం .. సంతానం కలగడం జరిగిపోయాయి.
కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ ఉండటంతో, ఇంట్లో చెప్పకుండా ఆయన బొంబాయికి వెళ్లిపోయారు.అక్కడ సినిమాలకి పనిచేయాలనే ఆలోచనతో స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. తెచ్చుకున్న 100 రూపాయలు అయిపోవడంతో, ఆయన ఒక టైలర్ ను బ్రతిమాలుకుని, రాత్రి సమయాల్లో ఆ షాపులో పడుకునేవారు. అందుకు కృతజ్ఞతగా ఉదయాన్నే ఆ షాపును క్లీన్ చేసి, అవకాశాల కోసం తన వేట మొదలుపెట్టేవారు. హిందీ .. మరాఠీ భాషలు రాకపోవడం వలన ఆయన మరింత ఇబ్బందిపడ్డారు.
మొత్తానికి ముందుగా వీనస్ లో .. ఆ తరువాత ఇండియన్ పిక్చర్స్ .. ఇంపీరియల్ పిక్చర్స్ లలో పనిచేశారు. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారే సమయంలో గ్యాప్ వచ్చినప్పుడు ఆయన ఒక థియేటర్ కి ‘గేటు కీపర్’గా కూడా పనిచేశారు. ఆ తరువాత ఒక వైపున సినిమాలకి పనిచేస్తూనే చిన్న చిన్న పాత్రలను వేయడం మొదలుపెట్టారు. అలా ఆయన తెలుగు తొలి టాకీ ‘భక్తప్రహ్లాద'(1931) హిందీ తొలి టాకీ ‘ఆలం అర’ .. తమిళ తొలి టాకీ ‘కాళిదాస్’లలో నటించి, ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
బొంబాయిలో కుదురుకుంటున్న సమయంలోనే ఆయన తన ఊరు వెళ్లి భార్య పిల్లలను తన వెంట తీసుకుని వచ్చేశారు. ఆ తరువాత ఆయనకి హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దాంతో ఆయన మద్రాసు వస్తూ, ఎల్వీ ప్రసాద్ గారిని కూడా తీసుకుని వచ్చారు. అప్పటికే ఒక వైపున నటనలోను .. మరో వైపున దర్శకత్వ శాఖలోను ఎల్వీ ప్రసాద్ అనుభవం సంపాదించుకున్నారు. హెచ్ ఎమ్ రెడ్డిగారి ‘తెనాలి రామకృష్ణ’లో కథానాయకుడిగా నటించిన ఆయన, ఆ తరువాత దర్శకుడిగా ‘గృహలక్ష్మి’ .. ‘పల్నాటి యుద్ధం’ .. ‘సంసారం’ .. ‘మనదేశం’ సినిమాలకి దర్శకత్వం వహించారు.
‘మనదేశం’ సినిమా ద్వారానే తెలుగు తెరకి ఎన్టీ రామారావు పరిచయమయ్యారు. ఇక ‘షావుకారు’ .. ‘మిస్సమ్మ’ .. ‘పెళ్లి చేసి చూడు’ .. ‘అప్పుచేసి పప్పుకూడు’ సినిమాలు దర్శకుడిగా ఎల్వీ ప్రసాద్ కి ఘనవిజయాలను అందించాయి. ఆయన దర్శక ప్రతిభకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఆ తరువాత ఆయన తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ సినిమాలకు కూడా దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఆయన బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తను సంపాదించిన డబ్బంతా ఆయన సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే ఖర్చు చేశారు.
ప్రసాద్ ల్యాబ్స్ .. ప్రసాద్ ఐమాక్స్ ఆయన కలలకు ప్రతిరూపాలు. ఇక పేదవారి కోసం ప్రసాద్ ఐ హాస్పిటల్ ను నిర్మించినది ఆయనే. ఇలా ఒక వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన తీరు ఎవరికైనా సరే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసిస్టెంట్ గా .. అసిస్టెంట్ డైరెక్టర్ గా .. దర్శక నిర్మాతగా ఆయన అంచలంచెలుగా ఎదిగారు. ఆశయం .. ఆత్మవిశ్వాసం ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదిరించి నిలబడవచ్చనే విషయాన్ని నిరూపించారు. తన కృషి కొలమానంగా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే .. రఘుపతి వెంకయ్య అవార్డులను అందుకున్నారు. ఆ కృషి రుషి జయంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : పేరుకు తగ్గ ‘శాంత’ కుమారి