We don’t: ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. వివిధ సంఘాల నేతలతో ఏర్పాటైన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నేడు జరిగింది. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి తాము గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని స్పష్టం చేశారు.
పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుంటే చర్చలకు వస్తామని వారు తేల్చి చెప్పారు. అంతకుముంది జీఏడీ కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సీరింగ్ కమిటీ సభ్యులకు ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చారు. దీనిపై స్టీరింగ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ప్రభుత్వం వద్దకు వెళ్లకూడదని, జీవోల ఉపసంహరనపై నిర్దిష్ట హామీ ఉంటేనే తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సమస్యల పరిష్కారం కోసం సానుకూల వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలకోసం మంత్రుల కమిటీని అధికారికంగా ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఉత్తర్వులూ లేవని, అందుకే ఆ సమావేశానికి వెళ్ళడం లేదని చెప్పారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇస్తామని చెప్పారు.
Also Read : చర్చలకు రండి: ప్రభుత్వం పిలుపు