దేశ ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైనదని, వారిని చైతన్య పరిచే సమయం ఇదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దేశ పరివర్తన కోసం జరిగే పోరాటం ఇదని, దీన్ని ఆ కోణంలోనే చూడాలని స్పష్టం చేశారు. తన పోరాటం పదవుల కోసం కాదని, దేశానికి కొత్త ఎజెండా సెట్ చేసి ముందుకు తీసుకొని పోవటమే తన లక్ష్యమని తేల్చిచెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు ఆయన మాటల్లోనే..
జాతీయ రాజకీయాల్లో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
————————————-
తెలంగాణలో చూస్తున్నరు.. తెలంగాణ కోసం ఉద్యమం జరిగింది. ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీలో ఒకాయన ముఖ్యమంత్రి అయిండు.. ఇంకో ఆయన మంత్రి అయిండు.. కొందరు ఎంపీలయ్యారు.. కొందరు కేంద్ర మంత్రులయ్యారు.. ఇలా ఎందరో అయ్యారు. ప్రాసెస్‌లో వ్యక్తులు ముఖ్యం కాదు. దేశ పరివర్తన కోసం జరిగే పోరాటంలో ఒక కార్యకర్తగా ఉద్విగ్నమైన, ఉజ్వలమైన పాత్రను పోషిస్తా. ప్రధానమంత్రి పదవికి పోటీ కాదు.. దేశ పరివర్తన కోసం జరిగే పోరాటం ఇది. దయచేసి ఈ విషయాన్ని ఆ కోణంలో చూడొద్దు. ప్రధాని ఎల్లయ్య అయితడా.. మల్లయ్య అయితడా కాదు.. కావాల్సింది దేశం బాగుపడాలి. దేశానికి కొత్త ఎజెండా సెట్ కావాలి. కొత్త విశ్వాసం రావాలి. కొత్త పంథాతో యువకులు పురోగమించాలి. ఈ దేశం ఉజ్వలమైంది. దేశం కోసం అవసరమైనప్పుడు ఎలాంటి పోరాటానికైనా వెరవకుండా, ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడి, ముందుకు వచ్చి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన చరిత్ర ఉన్నది. ఒక నాయకురాలు ఎమర్జెన్సీ విధిస్తే తిరగబడిన నాగరిక ప్రపంచాన్ని అణచివేసి జైలుపాలు చేసినప్పుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ మేల్కొని ఆయన నేతృత్వంలో యావత్‌దేశాన్ని జాగృతం చేసారు. జనతాపార్టీని స్థాపించి దేశ చరిత్ర మార్చేసిన ఉదంతాన్ని చూసాం. దేశ ప్రజలను జాగృతం చేయాలి. తెలంగాణ కోసం నేను నాయకుల వెంట పడలేదు. జనాన్ని జాగృతంచేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఈ రోజు కూడా నేను భావిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరిచే సమయం ఆసన్నమైంది.
జాతీయ స్థాయిలో మీ ఉద్యమం కార్యాచరణ ఏమిటి?
————————————-
నేను కొంత కాలంగా జాతీయ అంశాలపై కసరత్తు చేస్తూనే ఉన్న. హైదరాబాద్‌లో రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారుల సదస్సు పెట్టబోతున్నాం. అతి త్వరలోనే ఉంటుంది. మీరందరూ వస్తారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై నేను జాతకాలు చెప్పలేను. నేను తెలంగాణ కోసం కొట్లాడుతా అన్నప్పుడు కూడా టీఆర్‌ఎస్ పెడతనా.. పెట్టనా అనేది నాకు తెలియదు. చాలామంది మిత్రులు, మేధావులతో చర్చించిన తర్వాత పొలిటికల్ ఫార్మాట్‌తో ఫైట్ చేయాలని నిర్ణయించి.. ఆనాడు టీఆర్‌ఎస్‌ను స్థాపించాం. టీఆర్‌ఎస్ తన లక్ష్యాన్ని చేరుకొన్నది. ఇప్పుడు దేశంలో ఏం జరగాలి.. ఏ పద్ధతిలో ముందుకు పోవాలన్నది మేధోమధనంలో తేలుతుంది. కొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో రిటైర్డ్ అఖిలభారత స్థాయి అధికారులు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల అధికారుల సదస్సును నిర్వహించబోతున్నాం. దేశం ఏ దారి పట్టాలి.. ఏ పంథాలో పోవాలి.. ఎక్కడికి పోవాలనేదానిపై చర్చించాలి. సంకుచితమైన పదవుల కోసమో, ప్రధాని పదవి కోసమో, చిల్లర రాజకీయాల కోసమో నేను ఆలోచించడం లేదు. ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నాను. అందుబాటులో ఉన్న వనరులను కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి నుంచి, అసక్తత నుంచి ఈ దేశం బయట పడాలి, బాగుపడాలి. దేశంలోని ఎకనామిస్ట్ గోవిందరాజుతో, కేల్‌కర్‌తో మాట్లాడిన. మీటింగ్ ఇక్కడ పెడుతున్నమంటే దానికి ఒక పర్పస్ ఉంటది. ఎవరెవరితో మాట్లాడాలో, ఎవరితో షేర్ చేసుకోవాలో వాళ్లందరితో మాట్లాడుతాం. ఆ మీటింగ్‌లో భాగస్వాములయ్యే వారు చాలా అదృష్టవంతులు. అద్భుతమైన మార్పునకు మన హైదరాబాద్ వేదిక అవుతది. దానికి ఎంతో గర్వించాలి.
మీతో ఇంకెవరెవరు కలిసి వస్తారు?
————————————-
అందరూ కలిసి వస్తరు. టీఆర్‌ఎస్‌తో కలిసిరాలేదా? టీఆర్‌ఎస్ పుట్టిన తర్వాత కరుడుగట్టిన సమైక్యవాది చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించలేదా, బీజేపీతో జై తెలంగాణ అనిపించలేదా? మేం సమైక్య వాదులమని చెప్పిన ఎర్రజెండా పార్టీతో జై తెలంగాణ అనిపించలేదా? నోరు మూసుకొని పడుకున్న కాంగ్రెస్ పార్టీని లేపి జై తెలంగాణ అనిపించలేదా? రేపు కూడా ప్రజలు పరిగెడితే.. వారి వెంట అందరూ పరుగెత్తాల్సిందే. ఉద్యమాల కోసం తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ నాగరిక ప్రపంచంలో ఇందిరాగాంధీ లాంటి నేతనే ఈ దేశం గిల్లి పారేసింది. ఇప్పుడున్న మోదీ కూడా వచ్చింది ప్రజాస్వామ్య పరివర్తన నుంచే కదా? తెలంగాణ వచ్చింది కూడా ప్రజాస్వామ్య పరివర్తన నుంచే కదా? ప్రజలు ఒక్కసారి జాగరుకులై మేల్కొంటే.. నాయకులను వాళ్లే నడిపిస్తరు. వాళ్ల లక్ష్యం ఏమిటో ప్రజలకు తెలిస్తే.. మహోన్నత తరంగమై విజృంభిస్తరు.. పోరాడుతరు. ఇందులో దాచడానికి ఏం లేదు? నేను డీఎంకేని మాత్రమే కాదు దేశంలోని ఇతర పార్టీల నాయకులందరినీ కలుస్తున్నా. ముంబైకి వెళ్తున్నా.. ఉద్ధవ్‌థాక్రే జీతో మాట్లాడా. ఇందులో గల్తీ ఏం ఉంది. నేను ముంబయి వెళ్తున్నా.. ఈ దేశం విషయంలో నేను ఏం అనుకుంటున్నానో వాళ్ల ముందు పెట్టడానికి వెళ్తున్నా. అందరం కలిసి మాట్లాడుకుంటాం. మేం దేశ సిపాయిలం. యోధులం. పాగల్ కుక్కలకు మేం భయపడం.
జాతీయస్థాయిలో మీ ఎజెండా ఎలా ఉండబోతున్నది?
————————————-
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదు. సమస్యల పరిష్కారం విషయంలో మోదీకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది. ఏం చేయాలో అది చేస్తాం. దేశానికే పట్టిన దరిద్రం బీజేపీ. రాష్ర్టానికి ఇంకా ఎక్కువే. దేశం నుంచి పీకినప్పుడు రాష్ట్రంలో ఉంటది ఇంకా… వాళ్లు ఉన్నన్ని రోజులు ఏం పెరగదు. వీళ్లకు పెంచే తెలివిలేదు. దేశ ఎకానమీని లివరేజ్ చేసే తెలివి తేటలు బీజేపీ, కాంగ్రెస్‌లకు లేవు. కంట్రీ ఎకానమీ సైజ్‌ను పెంచే తెలివి వీళ్లకు లేకనే సమస్య. ఎన్నిరోజులాయే పాపం ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయ పరిమితి? ఎనిమిదేండ్ల నుంచి రెండున్నర లక్షలే ఉంటదా.. చకోర పక్షుల్లా చూస్తున్నరు. నేను పీఆర్‌సీలో జీతం పెంచితే.. ‘ఏం లాభం సార్ మీరు పెంచితే సగం పైసలు ఇన్‌కం ట్యాక్స్‌కే పోతున్నయ్’ అని మొత్తుకున్నరు. నేషనల్ ఎజెండాలో ఏమేం ఉంటదో మేం చూపిస్తాం. నేను నీతి ఆయోగ్ మీటింగ్‌లోనే చెప్పిన ఇవన్నీ. పౌల్ట్రీఫాం, డెయిరీ ఫాం మీద ట్యాక్స్ తీసేయిరా నాయినా అని చెప్పినం. డెయిరీ ఫాంలో ఇన్‌కం ట్యాక్స్ తీసేస్తే పాల ఉత్పత్తి పెరుగుతది. పిల్లలు మంచిగ పాలు తాగుతరు. బలిష్టమైన దేశం తయారవుతదనే బుర్ర లేదు. అన్ని గోల్‌మాల్ మాటలు చెప్పి రాజకీయంగా బలుసుడే తప్ప.. ప్రజలను బలిపిచ్చే ఆలోచనే లేదు.
దేశంలో ఎలాంటి మార్పు కోరుకొంటున్నారు?
————————————-
టీఆర్‌ఎస్‌ను స్థాపించేముందు 27సార్లు మన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టిన. అనేక మంది తెలంగాణవాదులతో, మేధావులతో వందలసార్లు కూర్చొని మాట్లాడిన. ఫైనల్‌గా సమయం, సందర్భం చూసి, తప్పదనుకొన్నప్పుడు టీఆర్‌ఎస్ పార్టీ పెట్టి ఉద్యమించినం. అలాగే ఇప్పుడు కూడా. ఇంతపెద్ద దేశం.. భిన్న మతాలు, సంస్కృతులు ఉన్న దేశంలో గుణాత్మక మార్పు రావాలె, దేశంలో తెలంగాణ వేరు, యూపీ వేరు కాదు. ఆంధ్రవాళ్లు మేం మేధావులం అన్నరు. తెలంగాణ చిమ్మచీకటయితదని కట్టెలు పెట్టి చూపించిన్రు. 30 ఏండ్లు ఏడిపించిన్రు. కరెంటు కోతలు పెట్టిన్రు. ఇప్పుడు ఎక్కడికెళ్లి వచ్చింది. మేం సిపాయిలం అని చెప్పిన ఏపీల ఎందుకు లేదు? మార్పు అంటే ఇది. ‘దో సాల్ మే జగ్‌మగాతే తెలంగాణ. ఔర్ జో బిజిలియా ఉపలబ్ద్ హే. ఔర్ దో సాల్ మే జగ్‌మగాతే హిందూస్థాన్’. ఆ చేంజ్ కావాలె. దానిని దేశం అర్థం చేసుకుంటే పోరాటం తప్పదు. భారతదేశ స్థాయిలో ఒక అంశాన్ని మాట్లాడాలి అంటే ఎంత తెలివి కావాలె! ఎంత ధైర్యం కావాలె! భారతదేశం సమాఖ్య దేశం. ఈ దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇప్పుడు బీజేపీ కూడా విఫలమైంది. అందుకే దేశానికి కొత్తశక్తి కావాలి. రాష్ర్టాలు ముందుకొస్తేనో? పార్టీలు ముందుకొస్తేనో అది సాధ్యం కాదు. అది ప్రజలకు తెలుసు. వాళ్లే నిర్ణయిస్తరు. దేశ ప్రజలు చైతన్యవంతులైనప్పుడే అది సాధ్యం. సమైక్యంగా గుణాత్మక మార్పు కోసం ముందుకు వస్తరు. ఇప్పుడు ఇండియా రియాక్ట్ కావాల్సిన అవసరమున్నది. మౌనంగా ఉండాల్సిన సమయం కాదిది.
మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్తరా?
————————————-
ముందస్తు ఎన్నికల సమస్యే లేదు. కొంత మంది బేవకూఫ్‌గాళ్లు ముందస్తు ఎన్నికలు అని చెప్తున్నరు. అసలు ఆ అవసరం ఏమైనా ఉన్నదా? టీఆర్‌ఎస్‌కు అద్భుతమైన మెజారిటీ ఉన్నది. ఎవడో సోషల్‌మీడియాలో పెడితే దాన్ని పట్టుకొని మేం ముందస్తు పెడతమా. గతంలో అంటే ముందస్తుకు పోవాల్సిన అవసరముండే. మొదలు పెట్టిన పనులు, పథకాలు కొనసాగాలంటే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉండే. అందుకే అప్పుడు ముందస్తుకు పోయినం. ఇప్పుడు ఆ అవసరమేమున్నది. ఈసారి కూడా మా దగ్గర మంత్రమున్నది. మీరందరూ రాసుకోండి ఈ వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తది. ఎవడో పిచ్చోడు, నెత్తిలేనోడు. బాధ్యత లేనోడు చెబితే నమ్ముతరా? ముందస్తు ప్రసక్తే లేదు. ఆర్నెల్ల ముందే మా అభ్యర్ధులను కూడా ప్రకటిస్తాం.