Saturday, November 23, 2024
HomeTrending Newsఉపాధ్యాయుల ఆందోళనలో అర్ధం లేదు

ఉపాధ్యాయుల ఆందోళనలో అర్ధం లేదు

No meaning: ఉద్యోగులతో చర్చలు ఫలప్రదంగా జరిగిన తర్వాత మళ్ళీ కొన్ని ఉపాద్యాయ సంఘాలు మళ్ళీ ఆందోళన అంటూ ప్రకటించడంలో అర్ధంలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత పీఆర్సీ స్టీరింగ్ కమిటీ ఓ అంగీకారానికి వచ్చిందని ఆ చర్చల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఉన్నారని, కానీ బైటికి వెళ్లి ‘నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటాం. 27 శాతం ఫిట్‌మెంట్, 12 శాతం మినిమం హెచ్‌ఆర్‌ఏ కావాలి.. దశల వారీగా ఆందోళన చేస్తామంటే.. దానికి ఏమైనా అర్థం ఉందా..?’ అని సజ్జల ప్రశ్నించారు. సమ్మె విరమించడం, ఉద్యోగులు సంతోషంగా ఉండటం కొందరికి నచ్చి ఉండకపోవచ్చని, అందుకే కొందరు సమ్మె జరిగితే దాని నుంచి నాలుగు పేలాలు ఏరుకోవాలనే ఆలోచనతో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. వామపక్ష పార్టీలతో అనుబంధంగా ఉన్న ఉద్యోగులు చర్చలకు హాజరై, సంతకాలు చేసిన తరువాత ఇలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. పీఆర్సీ సాధన సమితిలో ఉపాధ్యాయ సంఘాలు భాగమేనని సజ్జల వివరించారు.

ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకొని, సకాలంలో స్పందించామని, గతంలో అయితే సమ్మె మొదలైన తర్వాత చర్చలు జరిగేవని, తాము మాత్రం  సమ్మె వరకు వెళ్లకుండానే సమస్యను పరిష్కరించామని వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఉద్యోగులకు న్యాయం చేయగలిగామన్నారు. ఉద్యోగులు జేఏసీలుగా ఏర్పడి సమ్మెకు నోటీసులు ఇచ్చారని సమ్మె వల్ల ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వం ఇబ్బందులు పడటం భావ్యం కాదనే ఆలోచనతోనే ఉద్యోగులతో నిరంతరం చర్చలు జరిపామన్నారు.  ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే టీమ్‌ లాంటిదని, ప్రభుత్వ కష్టాలు ఉద్యోగులకూ తెలుసు కాబట్టి.. ఇది సాధ్యమైందన్నారు. ‘ఇది ఎవరి విజయం కాదు..ఓటమి కాదు. మధ్యలో వచ్చినవి అన్నీ చిన్నపాటివే అని ప్రభుత్వం భావించింద’ని చెప్పారు.  కొంతమంది ఉద్యోగనేతలు అమ్ముడుబోయారని మాట్లాడుతున్నారని, ‘కొనగలిగే వారు ఎవరు.. కొనేవారు ఎవరు ఉన్నారు. ఆ అవసరం, ఆలోచన వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఉందా..?’ అని సజ్జల ప్రశ్నించారు.

Also Read : వెనక్కి తీసుకోవడం కుదరదు : సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్