Vemulawada Temple :వేములవాడ రాజన్న ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మేడారం జాతర సీజన్ తో వేములవాడ రాజన్న హుండీ కి రికార్డ్ స్థాయలో కేవలం 12 రోజుల్లో 3 కోట్ల రూపాయలకు పైన ఆదాయం రావటం గమనార్హం. రాజన్న ఆలయ హుండీకి ఆదాయం భారీగా పెరిగిందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. గత నెల 27వ తేది నుండి భక్తులు స్వామి వారికి సమర్పించిన ఆదాయాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో రెండు రోజులపాటు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
మంగళవారం నాటికి 2 కోట్ల 15 లక్షల రూపాయల హుండీ ఆదాయాన్ని లెక్కించిన అధికారులకు… బుధవారం మరో 92 లక్షల 92 వేల 366 రూపాయల నగదు రూపంలో సమకూరింది… దీంతో రాజన్న హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12 రోజుల్లోనే 3 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక భక్తులు 289 గ్రాముల బంగారాన్ని, 12 కిలోల 944 గ్రాముల వెండిని కానుకల రూపంలో రాజన్నకు సమర్పించుకున్నారు. మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని సమ్మక్క సారాలమ్మ వనదేవతలను దర్శించుకోవటం ఆనవాయితి. కరోనా కూడా తగ్గు ముఖం పట్టడంతో ఈ దఫా భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.