Saturday, November 23, 2024
HomeTrending Newsమేడారం జాతరకు పోటెత్తిన జనం

మేడారం జాతరకు పోటెత్తిన జనం

Medaram Jatara : తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. మేడారంలో వనదేవతల ఆగమనానికి సర్వం సిద్ధమైంది. నేటి సాయంత్రం.. భక్తుల కోలాహలం నడుమ డప్పు వాయిద్యాలు హోరెత్తుతుండగా.. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి.. భక్తుల పూజలందుకుంటారు. వన దేవతల జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులతో కోలాహలంగా మారిన మేడారం.. నేటి నుంచి జన సంద్రంగా మారనుంది.

Medaram Jatara

వన దేవతలు జనం నడుమ మొక్కులందుకోనున్నారు. ఇప్పటికే భక్తుల జయజయ ధ్వానాలు… మేడారం పరిసరాల్లో మిన్నంటుతున్నాయి. భక్తి పారవశ్యంతో జనం ఉప్పొంగిపోతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లులను సల్లంగ సూడుమని వేడుకుంటున్నారు. విద్యుద్దీపకాంతులతో మేడారం పరిసరాలు ధగధగలాడుతున్నాయి. హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మేడారంలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం జాతర ప్రారంభమై.. శనివారం వరకు (16వ తేదీ నుంచి 19 వరకు) అంగరంగ వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వన దేవతలను దర్శిస్తారు.

 

తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి జాతర ఏర్పాట్లను ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మంత్రులు సత్యవతిరాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి మరీ అత్యవసరమైతే తప్ప మేడారం నుంచి బయటకు వెళ్లడం లేదు. అక్కడే ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం మేడారం సమీపంలోని కన్నెపల్లె నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలతో సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పాదయాత్రగా పూజారులు మేడారానికి బయలుదేరారు. 24 గంటలపాటు పాదయాత్ర సాగాక బుధవారం పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకుంటారు.

 

జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వారిని యథా స్థానానికి తరలిస్తారు. 1940 నుంచి మేడారం జన సంరంభంగా సాగుతోంది. 1996లో జాతరను అధికారిక పండుగగా ప్రకటించిన తర్వాత సౌకర్యాలు పెరిగాయి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రవాణా సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, వరంగల్‌ నుంచి హెలికాప్టర్‌ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి.

గోదావరికి ఉపనది అయిన జంపన్న వాగు జాతరలో పవిత్ర ప్రదేశంగా గుర్తింపు పొందింది. భక్తులంతా వాగులో స్నానం చేసిన అనంతరం పూజల్లో పాల్గొంటారు. జాతర ఈ ఏడాది పుష్కలమైన నీటితో కళకళలాడుతోంది.

Medaram Jatara

భక్తులకు సౌకర్యాలు..

జాతర ప్రాంగణంలో రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వరంగల్‌ నుంచి వచ్చే ప్రధాన రహదారిని విస్తరించారు. నాలుగు వేల ఆర్టీసీ బస్సులు సహా దాదాపు 50 లక్షల వాహనాలు జాతరకు వచ్చే వీలుంది. ఎప్పటి చెత్త అప్పుడే తొలగించడం, దుమ్ము రేగకుండా నీళ్లను చల్లడం వంటి చర్యలు చేపట్టారు. ప్లాస్టిక్‌ను నిషేధించారు. భక్తుల కోసం 327 ప్రాంతాల్లో 20వేలకు పైగా శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించారు.

పార్కింగు కోసం 1,100 ఎకరాలు..

ప్రైవేట్‌ వాహనాలకు పార్కింగు దూరంగా ఉంది. పార్కింగు కోసం 1,100 ఎకరాలు కేటాయించారు. 32 ఎకరాల్లో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. జంపన్నవాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించారు. జాతరకు ట్రాఫిక్‌ రద్దీ ప్రధాన సమస్య కాగా.. దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జాతర ప్రాంగణంలో హరిత హోటల్‌ ఉండగా.. తాడ్వాయిలో మరో హోటల్‌ను పర్యాటక శాఖ నిర్మించింది.

 

కరోనాపై అప్రమత్తం..

కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. మాస్క్‌లతో పాటు శానిటైజర్లను సైతం పంపిణీ చేస్తోంది. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆహారం, నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రభుత్వం ఆహారభద్రత అధికారులను నియమించింది.

Medaram Jatara

అర కిలోమీటరుకు ఒక అవుట్‌పోస్ట్‌..

మేడారంలో జాతర సందర్భంగా 11 వేల మంది పోలీసులతో గట్టి భద్రత కల్పిస్తున్నారు. అర కిలోమీటరుకు ఒక పోలీసు అవుట్‌పోస్ట్‌ ఉంది. వీటితో ప్రభుత్వ కంట్రోల్‌రూమ్‌లను అనుసంధానం చేశారు. దాదాపు 22వేల సీసీ కెమెరాలతో అనుక్షణం పరిస్థితులను పరిశీలిస్తారు. పదికి పైగా డ్రోన్లను వినియోగించబోతున్నారు. జాతరలో తప్పిపోయే పిల్లలు, పెద్దల సమాచారం కోసం ఈసారి 11 చోట్ల ఎల్‌ఈడీ తెరలను, పబ్లిక్‌ మైక్‌ వ్యవస్థలను ప్రారంభించారు. తెలంగాణ ఐటీ శాఖ ద్వారా పది వైఫై కేంద్రాలను కూడా ప్రారంభించారు.

Also Read : మేడారం జాతరకు టీఎస్‌ఆర్టీసీ సిద్దం – సజ్జనార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్