Monday, November 25, 2024
HomeTrending Newsఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఈటెల గుడ్ బై

ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఈటెల గుడ్ బై

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 19 సంవత్సరాల టిఆర్ఎస్ అనుబంధానికి, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరినప్పటినుంచి తెలంగాణా కోసం, ఉద్యమం కోసం అధ్యక్షుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు…. ఎందుకు అని కూడా అడగకుండానే రాజీనామా చేశానని గుర్తు చేశారు. ఎప్పుడూ ఓటమి చెందలేదని, పోటీచేసిన అన్నిసార్లు గెలిచానని ఈటెల అన్నారు. తెలంగాణా ప్రజలు ఆకలితో ఉంటారేమో గానీ ఆత్మగౌరవాన్ని వదులుకోరని వ్యాఖ్యానించారు. కుట్రలకు, కుతంత్రాలకు తెలంగాణలో స్థానం లేదని స్పష్టం చేశారు. ఉద్యమ నేతలనే గెలిపించిన చరిత్ర కరీంనగర్ కు ఉందని చెప్పారు.

తనపై ఎవరో ఒక అనామకుడు ఉత్తరం రాస్తే ఏం జరిగిందో తెలుసుకోకుండానే దానిపై వెంటనే విచారణ వేశారని, ఉరి శిక్ష పడ్డ ఖైదీకి కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారని, కానీ రాత్రికి రాత్రే మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేశారని ఈటెల ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు ముఖ్యమంత్రితో గ్యాప్ ఇప్పుడు వచ్చింది కాదని, ఐదేళ్లనుంచే వచ్చిందని చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఫాం హౌస్ కు వెళితే గేటు దగ్గరే ఆపారని, మరోసారి అప్పాయింట్ మెంట్ ఇచ్చి కూడా కలవలేదని అన్నారు. మొత్తం మూడుసార్లు అవమానం జరిగిందని, అది ప్రగతి భవన్ కాదు, బానిసల భవన్ గా పేరు మార్చుకోవాలని గోళీల ఎంపి సంతోష్ కు మొహం మీదే చెప్పానని ఈటెల అన్నారు. ఆత్మగౌరవం లేని మంత్రి పదవి ఎందుకని అప్పుడే అడిగానన్నారు.

వైద్య మంత్రి లేకుండానే వైద్యంపై సమీక్ష చేస్తారు, ఆర్థిక మంత్రి లేకుండానే ఆర్ధికశాఖ అధికారులతో సమీక్షలు జరుపుతాని వ్యాఖ్యానించారు. సిఎంఓలో పనిచేస్తున్న ఐఏఎస్ అఫీసర్లలో ఒక్క ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, బిసి గానీ లేరని గుర్తుచేశారు. సింగరేణి కార్మిక సంఘాలు, విద్యుత్ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ కార్మికుల సంఘం అన్నీ తన సొంత మనుషుల కంట్రోల్ లోనే ఉండాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు.

తనపై ఎన్నో కుట్రలు చేస్తున్నారని… గజకర్ణ గోకర్ణ టక్కుటమారా విద్యలతో తనను తెలంగాణా ఉద్యమం నుంచి వేరు చేయలేరని ఈటెల తేల్చి చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి పార్టీల్లాగా కుటుంబ పార్టీ కాదని, ఉద్యమ పార్టీ అని చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో ఉన్నోళ్ళు, ఇంటోళ్ళు బైటకు వెళ్తున్నారని, గతంలో అయన తిట్టినోళ్ళు పక్కనే కూర్చున్నారని చెప్పారు.

భవిష్యత్ కారాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఈటెల వెల్లడించారు. తనతో పాటు మాజీఎమ్మేల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ కూడా పార్టీకి రాజీనామా చేసినట్లు ఈటెల ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్