గద్దెలపై కొలువుదీరిన వనదేవతల ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులతో ములుగు జిల్లా మేడారం ప్రాంతం కుంభమేళను తలపిస్తోంది. గురుర్వారం రాత్రి 9.30 సమయంలో ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క రాకతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునేందుకు గురువారం రాత్రి నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల నుంచి భక్తులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అడవి తల్లుల ఆశీర్వాదం కోసం మొక్కులు తీర్చుకుంటున్నారు. జంపన్న వాగు తీరం పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులతో కిటకిట లాడుతోంది.
సమ్మక్క సారలమ్మలను ఈ రోజు ఉదయం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ లు దర్శించుకున్నారు. కేంద్రమంత్రులతో పాటు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బిజెపి సీనియర్ నేత లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. పండుగలకు జాతీయ హోదా ఇచ్చే ఆనవాయితీ లేదని పేర్కొన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సతీ సమేతంగా అడవి తల్లులను దర్శించుకున్నారు. అంతకు ముందు మంత్రి తులబారం వేయించుకొని బంగారం(బెల్లం)తో మొక్కులు తీర్చుకున్నారు.
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు హాజరై సమ్మక్క, సారక్కలను దర్శించుకున్నారు.తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్న మంత్రి తలసాని.