Dubai Expo: ఈ నెల 11 నుంచి ఫిబ్రవరి 17 వరకు దుబాయ్ లో జరిగిన ‘దుబాయ్ ఎక్స్ పో–2020’ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కు విశేష స్పందన లభించిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విదేశీ సంస్థలతో ఆరు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రాష్ట్రంలో రూ. 5,150 కోట్ల పెట్టుబడులు రానున్నాయని అయన వివరించారు. హైపర్ రిటైల్, ఫుడ్ ప్రోసెసింగ్ రంగంలో పెట్టుబడులకు రీజెన్సీ గ్రూపుతో ఒప్పందం జరిగిందన్నారు.
అల్యూమినియం కాయిల్స్, ప్యానల్స్ తయారీకి మల్క్ హోల్డింగ్స్ (అలుబండ్ అనుబంధ సంస్థ), ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూపు, శీతలీకరణ మౌలిక వసతులు కల్పించే తబ్రీద్, ఎలక్ట్రికల్ బస్సుల తయారీకి కాసిస్ ఈ మొబిలటీ, స్మార్ట్ సిటీ యుటిలీటీకి సంబంధించి ఫ్లూయంట్ గ్రిడ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 3,440 మందికి, పరోక్షంగా 7,800 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.