Cinema Event: నరసాపురంలో జరిగింది మత్స్యకార అభ్యున్నతి సభ కాదని, భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార సంక్షేమ శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు విమర్శించారు. జీవో 217, మత్స్యకారుల సమస్యలపై పవన్ చేసిన ప్రసంగాన్ని అయన తిప్పికొట్టారు. మత్స్యకారులను ఉద్ధరిస్తామంటూ సినిమా ప్రమోషన్ చేసుకున్నారని గతంలో వకీల్ సాబ్ సినిమా సమయంలో కూడా ఇలాగే చేశారని, సినిమా ప్రమోషన్ల కోసం రాజకీయాలను వాడుకుంటున్నారని మంత్రి దుయ్యబట్టారు. మరో సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాగే వస్తారని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల బతుకుల గురించి పవన్ కు అసలు ఏం తెలుసనీ, అసలు సభలో మత్స్యకారులు ఎంతమంది ఉన్నారని అప్పలరాజు ప్రశ్నించారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం సిఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, రిటైల్ అవుట్ లెట్స్ అన్నీ వారికే కేటాయిస్తున్నామని, పరిశుభ్రమైన వాతావరణంలో చేపలు అమ్మేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. రిటైల్ అవుట్ లెట్స్ పెట్టి చేపలు అమ్మితే తప్పేంట ని, చేపలను రాష్ట్రంలోనే మార్కెటింగ్ చేసుకునేలా చేస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబుకు మత్స్యకారులంటే చులకన భావం ఉందని, గతంలో వారికి ఏవిధమైన ప్రయోజనాలు అందించలేదని, అందుకే బాబు మాట్లాడలేని మాటలు పవన్ ద్వారా పలికిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు.