Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశివతాండవానికి తెలుగు మువ్వలు

శివతాండవానికి తెలుగు మువ్వలు

Saraswathi Putra on Shiva: ప్రతి అణువులో చైతన్య నర్తనానికి విస్తృత రూపం మొత్తం బ్రహ్మాండాల్లో చైతన్య నర్తనం. ఆ విశ్వ చైతన్య నర్తనమే శివతాండవం. ఇంతకంటే శివతాండవ రహస్యాల ప్రస్తావన ఇక్కడ అనవసరం. శివతాండవం అనగానే బాగా ప్రచారంలో ఉన్న “జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం” సంస్కృత స్తోత్రమే గుర్తుకు వస్తుంది. ఇది రావణాసురుడు రాసి, ఎకో సిస్టంలో దిక్కులు పిక్కటిల్లేలా క్రమ, ఘన, ఝట పద్ధతుల్లో స్వయంగా పాడాడని ఆ స్తోత్రం చివర ఉంటుంది. కానీ- మంత్ర శాస్త్ర రహస్యాలు తెలిసినవారు- ఇది రావణాసురుడు రాసినది కాదని అనాదిగా వాదిస్తున్నారు.

తెలుగులో అంతటి శివతాండవం ఉంది. సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు రచించి, గానం చేసిన శివతాండవం అర్థం చేసుకోవడానికి సంగీత, సాహిత్య, నాట్య శాస్త్రాల పరిచయం అవసరం. శ్రీ వైష్ణవుడై ఉండి నారాయణాచార్యులు శివతాండవం రాయడం ఒక విశేషం. ఆరు దశాబ్దాల పాటు ఆయన రాసిన నూట పది కావ్యాల్లో శివతాండవం ఒక్కటే అన్నిటినీ పక్కకు నెట్టి వెలగడం మరో విశేషం. పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పుట్టపర్తిని తెలుగువారు గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. ఆ బాధతోనే ఆయన పోయాడు. నిజానికి బాధపడాల్సింది మనం.  పదమూడో ఏట ఆయన రాసిన చిన్న కావ్యం- విద్వాన్ పరీక్షలో ఆయనకే పాఠం.  ప్రపంచ సాహితీ చరిత్రలో ఇంకే కవికి ఇలాంటి సందర్భం బహుశా వచ్చి ఉండదు.

శివరాత్రి పూట- పుట్టపర్తి వారి శివతాండవంలో శివుడు తెలుగు మువ్వలు కట్టుకుని, తెలుగులో ఎలా తాండవం చేశాడో చూద్దాం. ఇప్పటికి కనీసం పదిహేనుసార్లు ముద్రితమయిన శివతాండవం కావ్యానికి రెండు, మూడు ముద్రణలకు పుట్టపర్తి ముందుమాటగా, చివరి మాటగా అభిప్రాయంగా కొంత వివరణ ఇచ్చారు. శివుడి తాండవ ఉద్ధృతికి తగినట్లు తాండవగతి అంతా మహోద్ధతిలో సాగుతుంది. పార్వతి లాస్యభాగం చాలా మృదువైనది. ఆ రచన తేలికగా, పూల అలంకరణలా సాగుతుంది. భాష తెలియకపోయినా ఆసేతుహిమాచలం శివతాండవం ఆయన పాడగా విని ఊగిపోయింది. ఆ శబ్దమే శివతాండవాన్ని కళ్లముందు ప్రత్యక్షం చేస్తుంది. నిజానికి ఆ శైలి చదవడం కోసం కాదు. పాడడం కోసం. ఆ పాట కూడా శివుడి నాట్య వేగంతో సమానంగా సాగే సామగానసహిత సాహిత్య ప్రవాహం. పుట్టపర్తి శివతాండవం పాడగా విన్నవారిది అదృష్టం

శివతాండవం మొదలు కావడానికంటే ముందే ప్రకృతి పరవశించి సిద్ధమవుతోంది. గాలులు పులకింతతో చల్లగా వీస్తున్నాయి. గాలి తాకిడికి కొమ్మల్లో పూలు నేల రాలుతున్నాయి. రాలుతున్న పూలు ముసి ముసిగా మువ్వల్లా నవ్వుతున్నాయి. పార్వతి మెడలో పూలహారం అలంకారంగా వెళుతున్నాం కదా! శివతాండవాన్ని వి ఐ పి సీట్లో ముందు వరుసలో కూర్చుని చూడబోతున్నామని రాలే పూలు మెరిసిపోతున్నాయి. మురిసిపోతున్నాయి. జింకలు చెంగు చెంగున ఎగురుతూ కళ్లల్లో ఆనందబాష్పాలు చిందిస్తున్నాయి. తాండవానికి సిద్ధమవుతున్న శివుడిని జింకలు అలా కన్నీళ్లతో కాళ్లు కడిగాయి. పైన మబ్బులు బంగారు వర్ణం పులుముకుని గొడుగు పడుతున్నాయి. అప్సర యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గంధర్వులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పక్షుల కిలకిలలు వేదనాదాలుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మ దగ్గరుండి శివుడికి ఒక్కొక్క పామును ఒక్కో ఆభరణంగా సైజును బట్టి సర్దుబాటు చేస్తున్నాడు. తుమ్మెదల గుంపు శ్రుతి పడుతోంది. సెలయేళ్లన్నీ ఉప్పొంగుతున్నాయి. సాయం సూర్యుడు కొండల్లో దిగిపోకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. ఇలాంటి నేపథ్యంలో శివ తాండవం మొదలయ్యింది.

శివుడి తలపై గంగ అలలు అలలుగా ఎగసిపడుతోంది. నెలవంక అటు ఇటు కదులుతోంది. నుదుటిమీద ముంగురులు నాట్యమాడుతున్నాయి. మూడో కంట్లో నుండి నిప్పులు రాలుతున్నాయి. పెదవిమీద నవ్వులు నాట్యమాడుతున్నాయి. శివుడి నాట్యవేగానికి పాములు జారిపోతూ మళ్లీ గట్టిగా చుట్టుకుంటున్నాయి.

సముద్రం పొంగినట్లు, కొండలు ఎగిరినట్లు, భూగోళం తిరిగినట్లు, బ్రహ్మాండాలు బంతులాడినట్లు చూస్తున్నవారికి రెండు కళ్లు చాలలేదు. మొగలిపూల వాసనలు చల్లినట్లు మత్తెక్కుతోంది. అంతదాకా లేని వసంత శోభ ఒక్కసారిగా విచ్చుకుంటోంది. ఆ నాట్యం నవ్వుకు నడకలు నేర్పుతోంది. మువ్వలకు మాటలు నేర్పుతోంది. సూర్యుడికి వెలుగునిస్తోంది. తీగలకు సోయగమిస్తోంది. భంగిమల్లో విశ్వమంతా ప్రతీకలుగా ఒదిగిపోతోంది. ముద్రల్లో భావాలు భాష్యాలు పలుకుతున్నాయి. కైలాస శిఖరం అంచులు నిక్కి నిక్కి తేరిపార చూస్తున్నాయి. ఆకాశం ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసి ఆనందిస్తోంది. ముందువరుసలో కూర్చున్న విష్ణువు ఆనందం పట్టలేక కళ్లతోనే మాట్లాడుతున్నాడు. ఆ కంటిబాసకు శివుడు నాట్యం చేస్తూనే స్పందనగా ఒక నవ్వు విసిరాడు. ఇద్దరి నవ్వులో లోకాలు ఆనంద నర్తనం చేశాయి. శివుడు విష్ణువయ్యాడు. విష్ణువు శివుడయ్యాడు. చివరికి ఇద్దరూ ఒకటయ్యారు.

“ఆడెనమ్మా శివుడు.
పాడెనమ్మా భవుడు.
ఏమానందము?
భూమీతలమున!
శివ తాండవమట!
శివ లాస్యంబట!”

ఈలోపు పార్వతిలాస్యం మొదలయ్యింది. కళ్లలో నవ్వుల కాంతులు చిందుతున్నాయి. చిరుపెదవిలో శివుడి కళలు, కలలు కదులుతున్నాయి. సాక్షాత్తు పార్వతి కాలు కదిపితే తాము పక్కవాద్య సహకారమందించాలని కోటివీణలు తమకు తాముగా కదిలి మధురగానం చేస్తున్నాయి. ఆమె కాలి గజ్జెల్లో ప్రతి మువ్వ ఒక్కొక్క భావాన్ని పలికిస్తోంది. బ్రహ్మ మొదలు రుషులందరూ ఆమె లాస్యానికి తలలూపుతూ తన్మయంతో తేలిపోతున్నారు. పార్వతి లాస్యానికి పరవశుడై శివుడు కూడా చేయి కలిపాడు. శివపార్వతులు ఒక్కటై నాట్యం చేస్తున్నారు. సరస్వతి చేతి వీణ కచ్ఛపి మీటువేగం పెరిగింది. దిక్కులన్నీ పూలు చల్లాయి. దిగ్దిగంతాల్లో శివపార్వతుల నాట్యమే ప్రతిఫలిస్తోంది. ప్రతిధ్వనిస్తోంది.

శివ అంటే చైతన్యం, ప్రాణం, స్పందన, శుభం, మంగళం, వేదం. శివతాండవం అంటే ఆ ప్రాణ స్పందనకు ప్రతిరూపం. లేదా విశ్వ స్పందనకు సంకేతం. ఈశా అన్న మాటే శివ అవుతుంది. ప్రాణముంటే శివం. ప్రాణం లేకపోతే శవం. పార్వతి ప్రకృతి. శివపార్వతుల నాట్య, లాస్యాలు- ప్రాణి, ప్రకృతి స్పందనల సంకేతాలు.

Puttaparthis Shiva Thandavam

నారాయణాచార్యులు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వరాలయంలో నలభై రోజులు నిష్ఠగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడే కూర్చుని రాసిన కావ్యమిది. శివుడి తాండవానికి, పార్వతి లాస్యానికి తెలుగు నట్టువాంగమిది. పోతనచేత రాముడు భాగవతాన్ని రాయించినట్లు- పుట్టపర్తి చేత అగస్తేశ్వరుడు రాయించిన శివతాండవమిది. చదవాలంటే అదృష్టం ఉండాలి. వినాలంటే రాసిపెట్టి ఉండాలి. శివతాండవం శైలిలో కృష్ణ తాండవం కూడా పుట్టపర్తి రాస్తే చూడాలని లోకం కోరుకుంది. కుదరలేదు. హిందీలోకి శివతాండవాన్ని ఆయనే అనువదించాలని అనుకున్నారు కానీ- సాధ్యపడలేదు. ఆకాశవాణిలో పనిచేసి రిటైరయిన ఆయన కూతురు పుట్టపర్తి నాగపద్మిని శివతాండవాన్ని అదే ఉద్ధతిలో హిందీలోకి అనువదించి అనేక వేదికల మీద పాడారు. పాడుతున్నారు.

కడప ఆకాశవాణి వారు పుట్టపర్తివారు శివతాండవం పాడగా రికార్డు చేశారు. అయితే అప్పటికే ఆయన ఏడు పదులకు దగ్గరగా ఉన్నారు. బహుశా అంతంత గంభీర సమాసాలు ఊపిరి బిగబట్టి పాడడం సాధ్యం అయి ఉండకపోవచ్చు. కానీ అర్ధ శతాబ్దం పాటు ఆయన తిరిగిన ప్రతిచోటా శివతాండవం పాడారు. శివుడి తాండవాన్ని తన శబ్దాలతో, గాన గంగా ప్రవాహంతో ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. కొన్ని వేల వ్యాసాలు రాసినా, వందల విమర్శలు చేసినా, వందకు పైగా కావ్యాలు రాసినా…పుట్టపర్తి అంటే శివతాండవం. శివతాండవమంటే పుట్టపర్తి. సరస్వతీ పుత్రుడి కీర్తి కిరీటంలో శివతాండవమే కలికి తురాయి.

(మార్చి 1మహా శివరాత్రి శుభాకాంక్షలతో…)

-పమిడికాల్వ మధుసూదన్

 ఇవి కూడా చదవండి: శిలా ఫలకంపై కూలీల పేర్లు

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్