అక్కన్నపేట్ నుండి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్దప్రాతిపద్దికన రాబోయే నాలుగైదు మాసాలలో పూర్తి చేసి రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు రైల్వే అధికారులకు సూచించారు. రైల్వే లైన్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇంకా ఐదు శాతం పనులు మాత్రమె మిగిలి ఉన్నాయన్నారు. ఇందుకు 25 కోట్లు అవసరమని రైల్వే డివిజనల్ ఇంజనీరు సధర్మ తెలుపగా వెంటనే అట్టి నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆదివారం మెదక్ లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కోటి 35 లక్షలతో జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబ్ ను ప్రారంభించారు. అనంతరం రైల్వే, రెవిన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో మెదక్ రైల్వే లైన్, సాగునీటి ప్రాజెక్ట్ ల పురోగతిని అధికారులతో సమీక్షించారు. రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి దసరా నాటికి రైల్వే స్టేషన్ ప్రారంభించేలా చూడాలని రైల్వే అధికారులను మంత్రి కోరారు.
కరోన పరీక్షల కోసం జిల్లాలో రాపిడ్ టెస్టులు మాత్రమే చేసేవారని అందులో భాగంగా జిల్లాలో ఆర్టీపిసీఆర్ ల్యాబ్ ను ఈరోజు ప్రారంభించడం జరిగిందని, రేపటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని దీనిని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్, రెమిడిసివిర్, మందుల కొరత ఉన్నదా అని వైద్యాదికారులను అడిగారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ యస్. హరీష్, అదనపు కలెక్టర్ జి.రమేష్, పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శేరి సుబాష్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, ,జెడ్పి వైస్ చైర్ పర్సన్ లావణ్య, నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీనివాస రావు , ఆర్.డి.ఓ. సాయి రాం తదితరులు ఉన్నారు.