Saturday, November 23, 2024
HomeTrending Newsవెంటాడే జ్ఞాపకం

వెంటాడే జ్ఞాపకం

Allam Padmakka : దీనికి ఉపోద్ఘాతం అక్కర్లేదు. చదవండి. మీకే తెలుస్తుంది వెంటాడే జ్ఞాపకం అంటే ఏమిటో? మధురస్మృతి అంటే ఏమిటో?

22 ఫిబ్రవరి నాడు అల్లం పద్మక్క ఆఖరి శ్వాస విడిచిందని విని
అయ్యో…
ఇంత చిన్న వయసుకు నూరేళ్లూ నిండి నాయమ్మ నీకు అని బాధేసింది..

నువ్వున్నావు చూసుకోవడానికని
ఇన్నేళ్లు నిర్రందిగున్న అల్లమన్న పరిస్థితేంటని భయమేసింది…

1984 లో అల్లమన్న తో
పెండ్లి నాటికి
పద్మ కు పదిహేడేళ్ళు.
ఇంకా అక్క
హోదా రాలేదు
అమ్మ హోదా
లేనే లేదు..

నారాయనన్నేమో
అప్పటికే అజ్ఞాతంలకెల్లి
అన్ల తిరిగి,
అడవిని జూసి
పోరాటం జేసి
రాటుదేలినోడు…

కానీ పద్మ
కన్నగరం ముద్దసాని ఇంట్ల విరిసిన ముగ్ధ మనోహరి..

అన్న సాటు పిల్ల.
ఎక్కువ లోకం
తెలియని చెల్లె…

అల్లమన్న కుటుంబంలో
కొచ్చినంకనే పద్మ.. పద్మక్కయ్యింది…

రవళికి,
భావనకి,
రాహులుకీ
అమ్మయ్యింది…

బయటి గురించి తప్ప
తన గురించి
తన ఇంటి గురించి
ఏమీ పట్టించుకోని
అల్లమన్న కు
అన్నీ
తానయ్యింది..

ఆడపిల్లలోని
గొప్ప తనమదే…

తానేమీ కానీ ఇంటికి
బిక్కు బిక్కు మని
భర్త చాటు
భార్యగా
కోడలిగా
మరదలిగా
వదినగా
అడుగుబెట్టి,

ఆ ఇంటికి
పిల్లల రూపంలో
ప్రేమ దీపాలను
అలంకరించి,

ఆ ఇంట్లో
సుఖ
సంతోషాల్ని
నింపుతుంది..

అత్తారింటికి
తానే ఒక కొత్త వెలుగవుతుంది…

అల్లమన్న
జర్నలిస్టుగా
ఎడిటర్ గా
జీవితంలో ఎప్పుడు
విశ్రాంతి అన్నది
ఎరగకుండా
పన్జేషినోడు..

ఇల్లు
పిల్లలు
ఇంటికి
అచ్చేటోళ్లు
పొయ్యేటళ్లు
బోలెడు సుట్టాలు.,
బొచ్చెడు దోస్తులు..

తల్లెలు వెట్టే దాకా
ఆ తల్లికి
దెలువక పోతుండే..
తిండికి
ఎంతమందస్తరో…

అట్ల అంత మందికి చిరునవ్వుతో
అన్నం బెట్టిన పద్మక్క
ఆనాడే
అసలు సిసలు
అమ్మయ్యింది. అన్నపూర్ణయింది…

ఇంట్ల ఏమన్న
వున్నా,
లేకున్నా,
గా సంగతి
తెల్వనీయకుండ..
ముఖంల ఎప్పుడూ చిరునవ్వే…

ఇంట్ల గృహిణిగా గెలిచిన పద్మక్క..
సహచరుడు నారాయణ… తెలంగాణా కాడెత్తుకుని అలుపెరుగని
అక్షర పోరాటం
జేస్తుంటే…

ఆయనకు
అర్ధాంగయ్యింది..

తెలంగాణ అస్తిత్వమయ్యింది…

గా పోరాటానికి అమ్మయ్యింది…

పోరుగడ్డ
ఉస్మానియా
చెల్లె0డ్లకు
తమ్ముళ్లకు
తానే
అక్కయ్యింది..
అమ్మయ్యింది..

ఒక
ఆలంబనమయ్యింది..

అప్పటి దమన కాండల భాగంగా
లాఠీలిరిగితే
వారిని ఆదుకుని
అమ్మల సంఘం పెట్టి
ఎనలేని
ధైర్యమైంది…

అవును ఆమెకు
ఉద్యమమే ఉద్యోగమయ్యింది…

అల్లం పద్మక్క
నిష్క్రమణ తో
పుట్టెడు
దుక్కములున్న
అల్లం నారాయణనన్నను మాట్లాడించి(పరామర్శ) వద్దామని
సనత్ నగర్
చెక్ కాలనీ అపార్ట్ మెంట్
వాసవి ఇంద్రపస్థానికి
జ్యోతి
చిన్న సీనుతో కలిసి
జేరెసరికి,

అల్లమన్నతో
అన్నలు
అల్లం రాజయ్య, అల్లం వీరన్న
డాక్టర్ సూరి,
డాక్టర్ కౌలయ్య లున్నారు..

చెదరని చిరునవ్వుతో
నేనింకా ఈ ఇంట్లనే
ఉన్నానని నవ్వుతున్న పద్మక్క చిత్రపటం…

ఎదురుంగ
గుండెబరువుకు
గుర్తులుగా
ఆ కొన్ని
ఎర్రని
గులాబీ రెక్కలు…

ఒక మామూలు
మధ్యతరగతి ఫ్లాట్…

ఒక పక్క
జై తెలంగాణ అని
తెలంగాణ
సాధించిన్నాడు…
అల్లమన్న
నమస్తే తెలంగాణ దిన పత్రిక మొదటి పేజీల
రాసుకున్న జన
హృదయ ఘోష..
కేసీఆర్ సారు చిత్రంతో
ఉన్న ఫోటో ఫ్రెం…

అది ఒక అపురూప పోరాటానికి ఆనవాలు..

సబ్బండ వర్ణాల
తెలంగాణ గడ్డ,
పోరుగడ్డ గా మారి
చేసిన ప్రజా గర్జనకు
దృశ్య కావ్యం..

ఆ పక్కనే
అపర నటరాజులా
నర్తన మాడుతున్న
గద్దరన్న నిలువెత్తు
తైలవర్ణ చిత్రం…

మాటల్లో ప్రొఫెసర్ కిషోర్ వొచ్చారు ఇంతలో వసంతకుమార్ రెడ్డి కూడా చేరుకున్నారు..

కాస్సేపట్లో
ఆంధ్రజ్యోతిలో
నా పూర్వ సహచరుడు ఘంటా చక్రపాణి చేరుకున్నాడు నిజ జీవిత సహచరి పుష్పతో…

ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కేఎస్ గారు వొస్తున్నడని
సుధమ్మ కూడా వస్తోందని
చిన్న సీను జెప్పిండు..

అక్కడున్న వారు, వొస్తున్నవారిని చూస్తే..

అలనాటి విద్యల
నందనవనం
చైతన్య స్రవంతి
ఉస్మానియా విశ్వ విద్యాలయం..

వడ్డెర చండీదాసు
చిత్రితం..
అనుక్షణికం
గుర్తొచ్చాయి…

ప్రతిఒక్కరు
అటు అల్లమన్న తోనూ
ఇటు పద్మక్క తోనూ సమానంగా
అనుబంధాల్ని
ఆప్యాయతల్ని పంచుకున్నవారే.

అసలేం
జరగనట్టుగా
మామూలుగానే
కనిపిస్తూ.,

అటు క్లబ్ హౌస్లో
దుక్కాన్ని
దించుకునెందుకు
దుకాణం బెట్టిన
నాలుగు దోస్తుగాల్ల
బ్యాచులకు
మందు మాకు
సగవెట్టి…

ఇక్కడ పరామర్శలను
కూడా నిర్లిప్తంగా
స్వీకరిస్తున్న
నారాయణ
ఒక
అక్షర ఋషి లా కనిపించాడు..

పద్మక్క
ఇద్దరు
బిడ్డలు
పిల్లల తో
ఆ రోజే
అత్తారిళ్లకు పోయినట్టున్నారు…
ఇల్లంతా
ఖాళీగా
బోసిపోయినట్లుండె…

యాది…

ఎంత
చిన్న పదం..

రెండే
అక్షరాలు..

రెండు
హృదయాలు..
ఒకరి గురించి
మరొకరు
గుర్తుచేసుకోవడం
యాది..

ఒక్కరి కోసం
ఎన్నో గుండెలు
కొట్టుకోవడం
యాది…

ఒక తల్లి కోసం
కడుపున బుట్టిన
ఆడివిల్లలు
విలవిల్లాడి పోవడం
యాది..

అక్కడెక్కడో కట్టిన
మాసిన చీర
ఉయ్యాల్లో
గుక్క పట్టిన
పసిబిడ్డడి
ఏడుపుకి

ఇక్కడెక్కడో
రోడ్డు పనుల్లో
నడి ఎండలో
నడుం వంచిన
పురిటి
కూలి తల్లి
గుండెలు
బరువెక్కి
చనుబాలతో
రవిక పై
ఏర్పడ్డ తడి…

యాది….

ముప్పయ్యేడేళ్ల
జీవన సమరంలో
చేదోడు
వాదోడైన
సహచరి
చికిత్సే లేని
బీమారికి బలై..

అర్ధాంతరంగా
అదృశ్యమైతే

చిరునవ్వుల
చిరునామా
కాస్తా

గోడమీద
జ్ఞాపకాల
చిత్తరువయితే..

దుక్కమెవరితో
పంచుకోవాలో
తెలియక..

అర్ధ రాత్రి
దిగ్గున లేచి
గుండెలవిసేలా..

భర్త
ఒక్కడే
వెక్కిళ్ళతో
రోదించడం…

యాది..

ఆత్మీయుల
వియోగం
ముఖ్యంగా
కట్టుకున్నవారిక
లేరన్న
కఠిన
వాస్తవం…
ఎంతో
దుక్కాన్ని
మిగులుస్తుంది..

ఆ బాధ.
ఆ ఆవేదన,
ఆ లోటు ఏర్పరిచిన
అనంత శూన్యం…

ఆ రోజు
అల్లమన్న
కండ్లల్ల
కనిపించింది…

పద్మక్కా…

చిన్నతనంలనే
అమ్మ
అమ్మమ్మ హోదా సంపాదించిన మీరు
మరీ తొందరగా
బతుకు ప్రయాణం ముగించారక్కా…

మీరే ప్రాణంగా
బతికిన
అల్లమన్న…

మీకొంగు పట్టుకుని
తిరిగిన మీ పిల్లలు…

మిమ్మల్ని గుండెల్లో
వెట్టుకున్న
మీ అభిమానులు, ఆత్మీయులు…

మీరిక లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నారక్కా..

ఇరవై రెండేళ్లుగా
అనారోగ్యం పీడించినా
మీరెప్పుడూ
బేలగా మారలే..

నాకేంగాలేదు
మంచిగున్ననని
చిరునవ్వుతో
మీరు జెప్పిన
వందల అబద్ధాలు
మా చెవుల్లో
మారు మోగుతూనే ఉన్నాయి..

అది నిజం గాదు
అబద్ధమని
ఆద్రిక,
అవని
కనిష్క్ కాన్నుంచి
మా అందరికి తెలిసినా….

ఆ అబద్ధం మాకు నిబ్బరాన్నిచ్చింది…

ఇంకా కొన్నేళ్ళు మీరు మాతోనే ఉంటారన్న భరోసానిచ్చింది…

కానీ జీవితం చిత్రమయ్యింది…

ఏమీ లేని నాడు
ఆరోగ్యాన్ని
అంతులేని
ఆనందాన్నిచ్చిన
జీవితం…

ఇప్పుడు
అల్లమన్నకు
అన్నీ
ఉన్నాయనుకునేంతల

మిమ్మల్ని
తీసుకెళ్లి
మళ్ళీ
నిరుపేదను
జేసింది…

వెండి తీగల్లాంటి
జుట్టు,
తెల్లని గడ్డంల
పైకి నవ్వుతున్న
అల్లం హృదయంలో
దుఃఖం
బాధ
ఆయన కండ్లల్ల
కననే
వడుతున్నయి….

నలబయ్యేండ్ల
పాత్రికేయ
జీవితంలో..

ఇరవయ్యేండ్ల
తెలంగాణ
ఉద్యమంలో…

ప్రాణహిత పేరిట
చేసిన
అక్షర యుద్ధంలో…

నారాయణ
ఎప్పుడు
కలం
కాడి
దించింది లేదు…

ఇప్పుడు
మొదటి సారి
తన
సహచరి,
తన
ప్రాణహితను కోల్పోయినప్పుడు
మాత్రం

విచలితుడయ్యాడు…

అన్న అల్లం రాజయ్య
మరో అన్న,
అనుంగు
సోదరుడికంటే
మిన్నయిన
అల్లం వీరన్న,

తననే ప్రాణంగా
చూసుకునే బిడ్డలు
అల్లుళ్లు మనవరాళ్లు మనవడు
తండ్రి చాటునే ఉన్న కొడుకు రాహుల్,,

ఇంకా నిన్నభిమానించే… మాలాంటి లక్షల
తమ్ముళ్లు,
చెల్లె0డ్లు…
మా
కోసమన్న
దైర్యంగుండన్న…

పద్మక్క భౌతికంగా
మన మధ్య
లేక పోయినా
ఆమె ప్రేమ
అభిమానం
ఆమె సాహసం
మనలో
పది కాలాలపాటు… పదిలంగా
వుంటాయన్న…

అందరికి
జననముంటుంది…

మరణమూ
ఉంటుంది…

పద్మక్కలాంటి
పునీతలకు మరణముండదు…

ఉండేది
అమరమే…..????????

అశ్రు నివాళులతో..
కన్నీటి చెలమలతో…

నీ తమ్ముడు
-చంద్ర మోహన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్