రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను హరీశ్‌రావు వివరంగా చదివి వినిపించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు పోతున్నదని స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు లేని తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పేద, దళిత, వెనుకబడిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తూ, వారి మన్ననలను అందుకుంటుందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తాం.. ఎన్ని అవరోధాలు సృష్టించినా వాటిని అధిగమించగల సత్తా తమ ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ది కోసం, తద్వారా జాతి నిర్మాణం కోసం పునరంకితమవుతామని సవినయంగా తెలియజేస్తున్నాను. ఇది మాకు తెలంగాణ ఉద్యమం నేర్పిన సంస్కారం. దీన్నిభవిష్యత్తులోను కొనసాగిస్తాం అని తెలియజేస్తు 2022-23 సంవత్సరానికి గాను రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను అని హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
అసెంబ్లీ బుధవారానికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి(మార్చి 9) వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని రెండు గంటల పాటు చదివి వినిపించారు. ఉదయం 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగా, మధ్యాహ్నం 1:30 గంటలకు హరీశ్‌రావు తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
బడ్జెట్ ప్రసంగానికి అడ్డు పడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావును ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.