Saturday, November 23, 2024
HomeTrending Newsఆస్ప‌త్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి

ఆస్ప‌త్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి

Cm Kcr Discharge : సోమాజిగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. య‌శోద నుంచి కేసీఆర్ నేరుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. వైద్య ప‌రీక్ష‌లు ముగిసిన అనంత‌రం కేసీఆర్‌ను కాసేపు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి డిశ్చార్జి చేశారు. కేసీఆర్‌కు ఎలాంటి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు లేవ‌ని య‌శోద ఆస్ప‌త్రి వైద్యులు ఫిజిషీయ‌న్ ఎంవీ రావు, కార్డియాల‌జిస్ట్ ప్ర‌మోద్ కుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌లు ర‌కాల వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్‌కు స‌ర్వైక‌ల్ స్పాండిలోసిస్ అని నిర్ధారించామ‌ని వారు పేర్కొన్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రికి సూచించామ‌ని వైద్యులు తెలిపారు.
సీఎం కేసీఆర్ శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో య‌శోద ఆస్ప‌త్రికి వ‌చ్చారు. డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలో కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, రక్త ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ రిపోర్ట్స్ అన్ని నార్మ‌ల్‌గానే ఉన్నాయ‌ని వైద్యులు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, కుమారుడు కేటీఆర్, కూతురు క‌విత‌, మ‌నుమ‌డు హిమాన్షు, మంత్రి హ‌రీశ్‌రావు, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ఉన్నారు.

సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత యశోద వైద్యులు ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు. చేయి నొప్పిగా ఉందని సీఎం చెప్పారని.. అందుకే ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించామని డాక్టర్ ఎంవీ రావు మీడియాకు తెలిపారు. ‘కరోనరి యాంజియోగ్రామ్‌లో ఎలాంటి బ్లాక్స్ లేవు. ఈసీజీ, టూడీ ఈకో పరీక్షలు కూడా చేశాం. కార్డియో వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. మెదడుకు సంబంధించిన ఎంఆర్ఐ పరీక్షలు చేశాం. ఉదయం 8 గంటలకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పారు. మెడ స్పైన్ వల్లే చేయి నొప్పి వచ్చింది. ఎలాంటి ఇబ్బందీ లేదు. రక్తపరీక్షలు కూడా నిర్వహించాం.. ఎలాంటి సమస్యా లేదు.. అంతా బాగుంది (All is Well) వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించాం. బీపీ, షుగర్ కూడా నార్మల్‌గా ఉన్నాయి. కరోనా తర్వాత ఏమైనా సమస్యలు వచ్చాయేమో అని యాంజియోగ్రామ్ చేశాం. గుండెకు సంబంధించిన ఎలాంటి మేజర్ సమస్యలూ లేవు. దాదాపు 90 శాతం రిపోర్ట్స్‌ వచ్చాయి. ఎలాంటి ఆందోళన లేదు, ఆరోగ్యంగా ఉన్నారు. వయసు రీత్యా స్వల్ప సమస్యలు ఉండటం సహజమే. విశ్రాంతి తీసుకుంటేనే మంచిది. వరుస పర్యటనలతో నీరసంగా ఉంటున్నారని యశోద ఆస్పత్రి వైద్య బృందం మీడియాకు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్