Why Early?: ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు ప్రజలు అధికారం ఇచ్చారని, ఏవో ఆలోచనలతో ముందస్తుకు వెళ్ళాల్సిన అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. సిఎం జగన్ ముందస్తుకు వెళతారంటూ టిడిపి అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని అయన తిప్పి కొట్టారు. వరుస ఓటములతో డీలా పడిన కేడర్ ను, మిగిలి ఉన్న నేతలను, అడుగంటిన పార్టీని కాపాడుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మిగిలి ఉన్న నేతలు కూడా ఎప్పుడు ఈ పార్టీ నుంచి బైట పడాలా అని అలోచిస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు ఒక ఆశావాదం సృష్టించేందుకే బాబు ఇలాంటి ఇలాంటి ఎత్తులు వేస్తున్నరన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ప్రజలను మోసం చేయాలనుకున్నవారే ముందస్తుకు వెళతారని వ్యాఖ్యానించారు. ప్రజలు ఆశించిన దానికంటే మరింత సంక్షేమం చేస్తున్నామని, ఇంకా ఇవి పూర్తి చేయడానికి సమయం కావాల్సిన పరిస్థితిలో ముందస్తు ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు.
వైసీపీ నేతలు తమ పార్టీలోకి రావాలంటూ బిజెపి, జనసేన ఆహ్వానించడం హాస్యాస్పదమన్నారు. మీ పార్టీలకు డిమాండ్ ఎక్కడుందని, అక్కడకు వచ్చి ఎం చేస్తారని సజ్జల ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తల డీయెన్ఏ వేరని, వైఎస్ కుటుంబంతో ముడిపడి ఉన్న అనుబంధం అని చెప్పారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పాలన రెండూ కీలకమైన అంశాలేనని సజ్జల చెప్పారు. కేబినేట్ ను రెండున్నరేళ్ళ తర్వాత పునర్ వ్యవస్థీకరిస్తామని సిఎం జగన్ మొదట్లోనే చెప్పారని, త్వరలోనే ఉండొచ్చని వెల్లడించారు.