తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని, సంవత్సరానికి 2 వేల సీట్ల చొప్పున ఎంబీబీఎస్ సీట్లను పెంచుకుంటున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 700లుగా ఉంటే.. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ సంఖ్య 2,850కి పెంచుకోవడం జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 12 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్, రామగుండం ఏరియాల్లో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తోందన్నారు. అంతే కాకుండా 2022లో మరో 8 ప్రదేశాల్లో అనుబంధంగా ఉన్న ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ వద్ద 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, నిర్వహణలోకి తీసుకువచ్చామని తెలిపారు. మిగిలిన 8 వైద్య కాలేజీల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా యూజీ సీట్లు 1640కి, పీజీ సీట్లు 934కు పెంచడం జరిగిందన్నారు.
మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. సమైక్య రాష్ట్రంలో అనేక రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరిగింది. అందులో ఒకటి వైద్యారోగ్య రంగం. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మూడు మెడికల్ కాలేజీలు కేటాయించారు. ఉద్యమం చేయడం వల్లే ఆదిలాబాద్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. 60 ఏండ్లలో మూడు కాలేజీలు వస్తే ఈ ఆరేండ్లలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాం. దేశంలోనే ఇంత గొప్పగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్రం కూడా తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తుంది. దేశ వ్యాప్తంగా 171 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీవ్ర అన్యాయం చేసింది. కేంద్రం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకు రూ. 200 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపినా కూడా చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తుంది.
వచ్చే విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్లు 2850కి పెంచుకోవడం జరుగుతుందన్నారు. మిగతా కాలేజీలు కూడా పూర్తయితే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య మరింత పెరగనుందన్నారు. 27 వేల పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చుకోవడం జరిగిందన్నారు. 26 ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసుకున్నాం. కరోనాను ఎదుర్కొనేందుకు ఐదంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకునేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించుకుంటున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.