We are Single: చేతబడి చేసే పూజారులందరూ ఒకచోట చేరినట్లు, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి, అన్ని పార్టీలను ఏకం చేయడానికే పవన్ కళ్యాణ్ నేడు ఆవిర్భావ సభను పెట్టుకున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే గత ఎన్నికల్లో సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు మాత్రం వ్యతిరేక ఓటు చీలకూడదని అంటున్నారని, దీనిలో మర్మమేమేమిటో జనసేన కార్యకర్తలు గ్రహించాలని, టిడిపి పల్లకి మోయడానికి, చంద్రబాబును సిఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కంఠం పవన్ ది, భావం చంద్రబాబుదని; స్పీచ్ పవన్ ది, స్క్రిప్ట్ చంద్రబాబుదని పేర్నిఅభివర్ణించారు.
జనసేన ఆవిర్భావ సభలో అందరికీ ధన్యావాదాలు చెప్పిన పవన్ కళ్యాన్ తన అన్న చిరంజీవి పేరు ప్రస్తావిచకపోవడం అయన సంస్కారంలేనితనానికి నిదర్శనమన్నారు. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడుండేవారని, తీగ లాంటి పవన్ కు చిరంజీవి ఊతకర్రగా ఉపయోగపడ్డారని గుర్తు చేశారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించడమే తన ఏకైక సిద్ధాంతంగా పవన్ పెట్టుకున్నారన్నారు. తెలుగుదేశం, బిజెపిని కలిపి ఉంచాలన్నదే పవన్ లక్ష్యమని, అయన ఎప్పుడూ టిడిపి కోసమే పనిచేస్తుంటారని పేర్ని విమర్శించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవడం అలవాటయ్యిందని, మూడేళ్ళలో సిఎం జగన్ పేద ప్రజలకు నేరుగా నగదు ప్రత్యక్ష బదిలీ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు అందించారో రాసినవారు మర్చిపోయారా అని నాని సూటిగా అడిగారు.
తొమ్మిదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్న పవన్ అంతకు ముందే ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని, ఆ విషయాన్ని అయన మర్చిపోయినట్లున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ వల్ల రాష్ట్రానికి జరిగిన మంచి ఏమిటని నిలదీశారు. మానసిక అత్యాచారం అని మాట్లాడుతున్న పవన్ నేటి సభలో వెల్లంపల్లి, అవంతి గురుంచి మాట్లాడిన మాటలు మానసిక అత్యాచారం కాదా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబును ర్యాంబో రాంబాబు అని అనడం ఏమాత్రం సబబని నాని అడిగారు.
అమరావతి కుల రాజధాని అని, తాము అధికారంలోకి వస్తే కర్నూలును రాజధానిగా చేస్తామని గతంలో చెప్పిన విషయాన్ని పవన్ మర్చిపోయారన్నారు. అమరావతిని అసెంబ్లీ సాక్షిగా జగన్ ఒప్పుకున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అత్యున్నత చట్టసభ పార్లమెంట్ లో శాసనం చేశారని, ఆ విషయాన్ని బిజెపి నేతలను పవన్ ఎందుకు అడగలేకపోయారని, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కులపై ఎందుకు మాట్లాదడంలేదని పేర్ని నాని నిలదీశారు.
2024 ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా బిజెపి, టిడిపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలను కలిపి పనిచేయించడమే అయన ధ్యేయమని తూర్పారబట్టారు. సినిమాలు, రాజకీయాలు వేరని; భీమ్లా నాయక్ సినిమాలో చెప్పిన డైలాగులకు,నేడు చెప్పిన విషయాలకు తేడా ఏమీ లేదని, అక్కడ విలన్ ను తిడిదే నేడు వైసీపీ పేరు మార్చారన్నారు. పవన్ కళ్యాణ్ చిరంజీవితో పాటు లింగమానేని పేరు కూడా మర్చిపోయారని నాని వ్యంగాస్త్రం సంధించారు.
ఇవి కూడా చదవండి: వ్యతిరేక ఓటును చీలనివ్వను: పవన్