Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపుష్పక విమానం

పుష్పక విమానం

Dandu Monara: భారతీయులకు అత్యంత ప్రాచీన, మౌలిక ప్రమాణాలు వేదాలు. ఇవి అపౌరుషేయాలని, పరబ్రహ్మం అనే చైతన్య పదార్ధం ద్వారా తెలుపబడినవని, వీటిని వినడం ద్వారా దర్శించి, గానం చేసిన వారిగా మన ఋషులను పేర్కొంటారు. అందుకే ఆ ఋషులు ద్రష్టలయ్యారు. వేదాలు శ్రుతులు అయ్యాయి.

నిజానికి ఈ ఋషులు సృష్టి పరిణామం, సృష్టి రహస్యాలు, సూర్యమండలం…  ఇంకా చాలా వైజ్ఞానిక విషయాలపై ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తల లాగానే అప్పుడు పరిశోధించి కొన్ని అంశాలు చెప్పారు. అలాంటి వారిలో ఆర్యభట్ట, వరాహమిహిర, భరద్వాజుడు వంటి వారు ప్రముఖులు.

వేదాలను, వాటిలో చెప్పిన విషయాలను గ్రహించడం అంత తేలిక కాదు. నిజానికి ఈ వేదాలను తెలుసుకోవడానికి, అర్ధం చేసుకోవడానికి.. వేదాంగాలుగా చెప్పబడే  ‘శిక్ష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు, నిరుక్తం, కల్పం’  ఆధారంగా చదవాలని,  అప్పుడే వాటి సమగ్ర రూపం బోధపడుతుందని పెద్దలు చెపుతారు.

వేదాల్లో చెప్పబడిన జ్ఞానాన్నీ, ఆలోచనలను, సత్యాన్వేషణను ఎలా చేయాలో వేదాంతాలుగా చెప్పబడే ఉపనిషత్ లు చెప్పాయి. నిజానికి ఇవి కూడా “ఆలోచనల ద్వారా” సత్యాన్ని శోదించే పరిశోధనా గ్రంధాలే. వేదాల్లో చెప్పిన వాటిని గ్రహించడం కష్టం కాబట్టే వేదవ్యాసుడు వచ్చి, ఆ వేదాలను విభాగాలు చేశాడు. కొన్నింటిని  కథలుగా మార్చి.. పురాణాలు రాశాడు. నిజానికి గత 800 సంవత్సరాల పై బడి , భారతదేశం పైకి విదేశీయుల దండయాత్రల వల్ల, మనకు వేద వాజ్మయం అంతా ‘అలభ్యం’ అయ్యింది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు చదివినవారు, తెలిసినవారు దాదాపు మృగ్యం అయ్యారు. దాంతో ‘వేదాలలో ఏమి లేదని’ కొందరు,  ‘వేదాలలో లేనిది లేదని’ మరి కొందరు  ‘కుహనా మేధావులు’ తయారై, పరస్పరం వాదులాడుకొంటూ.. అసలు విషయం వదిలిపెట్టి.. భావోద్వేగాలు, వర్గ వైషమ్యాలు, మత వైషమ్యాలు రెచ్చగొడుతుంటారు.

నిజానికి ‘మ్యాక్స్ ముల్లర్’ వంటి పాశ్చాత్య మేధావులు మన వైదిక వాజ్మయాన్నంతా  అనువాదం చేసి ప్రచురించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా మన వేదాల్లో ఉన్న గొప్పదనం వెలుగులోకి వచ్చింది. అప్పుడే మనకు వేదాల్లో ఎంతో విజ్ఞానం ఉందనేది తెలిసింది.

Dandu Monara

ఇక మనం ఇతిహాసాలుగా చెప్పుకొనే  మహాభారత, రామాయణాల్లోని కొన్ని అంశాలపై మేధావులు-హేతువాదుల మధ్య వివాదం తలెత్తుతుంటుంది.  ఉదాహరణకు ఆధునిక సైన్స్ విజయంగా చెప్పుకొనే టెస్ట్ ట్యూబ్ బేబీల జననం గురించి భారతంలోనే ఉందని… అగస్త్యుడు, వందమంది కౌరవులు అలానే జన్మించారని కాబట్టి, ఇది కొత్త విషయం కాదని సంప్రదాయవాదులు  చెపుతుంటే.. దీనికి ప్రమాణం, సాక్ష్యాలు లేవు కాబట్టి నమ్మబోమని హేతువాదులు వాదిస్తుంటారు.

కానీ  పాశ్చాత్య చదువులకు అలవాటుపడి  అదే నిజమని నమ్మే మనకు నిజానికి మన వేదాల్లో, వేదాంగాల్లో ఏముందో గ్రహించే తీరిక, ఓపిక రెండు లేవు. దీనికి ప్రధాన కారణం వేదాలు, వేదాంగాలు, ఉపనిషద్ లు , మన ఋషులు రాసిన అనేక శాస్త్ర గ్రంధాలు సంస్కృతంలో ఉండడం,  ఆ భాషను మనం మరిచిపోవడం.

ఇక ఈ కోవలోనే రామాయణంలో రావణాసురుడు “పుష్పకం” అనబడే విమానంలో ఎక్కి తిరిగే వాడని, ఇది కుబేరుని వద్ద ఉంటే యుద్ధంలో కుబేరుని ఓడించి, దాన్ని తెచ్చుకొని లంక లో పార్క్ చేశాడని చదివాం. ఈ విమానం రావణుడు అలా మనసులో ఎక్కడికన్నా పోవాలని తలవగానే అలా వెళ్లిపోయెదట. లంకలో రావణ సంహారం తరువాత సదరు రాముడు సీతను, ఇంకా విభీషణ పరివారాన్ని తీసుకొని అయోధ్య కు కూడా ఈ పుష్పకం మీదే వెళ్లాడట.

శ్రీ యం. యస్. రామారావు గారు తన సుందరకాండ లో హనుమంతుడు లంకలో సీత ను వెదుకుతూ, పుష్పక విమానాన్ని చూసిన సందర్భంలో దాని వైభవం గురించి ఇలా గానం చేశారు.

యమకుబేర వరుణ దేవేంద్రాదుల
సర్వ సంపదల మించినది.
విశ్వకర్మ తొలుత బ్రహ్మ కిచ్చినది
బ్రహ్మ వరమున కుబేరుడందినది

రావనుండు కుబేరుని రణమందు
ఓడించి లంకకు గొని తెచ్చినది
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందే

నేలను తాకక నిలిచియుండునది
రావణ భవన మధ్యంబుననున్నది
వాయుపధమున ప్రతిష్టమైనది
మనమున దలచిన ప్రీతిపోగలది

దివినుండి భువికి దిగిన స్వర్గమది
సూర్యచంద్రులను ధిక్కరించునది
పుష్పకమను మహా విమానమది
మారుతి గాంచెను అచ్చెరువొందే

Dandu Monara

ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం కూడా రావణుడే ఫస్ట్ విమానం నడిపాడని, ఆయనే మొదట విమానం వాడాడని, దానికి పార్కింగ్ ప్లేస్ అంటే ఎయిర్పోర్టు లు కూడా నిర్మింపచేశాడని గట్టిగా నమ్ముతోందట. పుష్పకాన్నే శ్రీలంక లో ‘దండు మోనర’ అనే వారట. దీని  ప్రస్తావన శ్రీలంకలో చాలా కథల్లో ఉన్నదట.  ఈ ‘దండు మోనర’ లోనే రావణుడు అనేక ప్రాంతాల్లో విహరించేవాడట. సదరు రావణుడు భారతదేశానికి కూడా మొదట విమానంలో వెళ్ళి రావడమే కాకుండా, తానే దాన్ని నడిపాడని శ్రీలంక పురావస్తు వేత్తలు బలంగా నమ్ముతున్నారట. కాబట్టి రావణుడి దండుమోసర సంగతి తేల్చాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించి ఈ ప్రాజెక్టు కు ‘ఏవియేటర్ రావణ’ అని పేరు పెట్టి, నిధులు కూడా కేటాయించిందట. రైట్ బ్రదర్స్ విమానం కనిపెట్టడానికి ఎంతో ముందే సదరు లంకేయుడు రావణుడు వైమానిక శాస్త్రంలో దిట్ట అని నిరూపించాలని శ్రీలంక ప్రభుత్వం కంకణం కట్టుకొన్నదట.

గతంలో కూడా భారతదేశం నుంచి శ్రీలంక కు కట్టిన వారధి నాసా ఉపగ్రహ చిత్రాలలో కనబడుతుందని సోషల్ మీడియా ఊదర గొట్టింది. దాంట్లో నిజనిజాలు ఏ ప్రభుత్వం తేల్చలేదు.

కనీసం మన సోదరులు లంకేయులైనా రావణుడి ‘దండు మోనర’ యానాన్ని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని ఆశిద్దాం.

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also Read :

పర్యాటక లంకాయణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్