Sunday, June 2, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపర్యాటక లంకాయణం

పర్యాటక లంకాయణం

Ramayan – Srilanka: ఇది మరీ ట్రావెలాగ్ కాదుకానీ, కొద్దిగా అలాంటిదే. ఈరోజుల్లో గూగులమ్మను అడిగితే అన్నీ చెబుతుంది. మళ్లీ విడిగా నాలాంటివారు రాయడం ఎందుకు? సద్ది కట్టుకుని, మూట ముల్లె సర్దుకుని హైదరాబాద్లో శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానం ఎక్కి, కొలొంబోలో దిగాము. విశాఖలో సముద్రతీర వాతావరణంలా కొలొంబోలో ఉక్క ఉక్కగా ఉంది . . . అంటూ నిమిష నిమిషానికి ఏమి జరిగిందో రాయవచ్చు. కానీ, నా ఉద్దేశం అదికాదు.

భారతీయులకు లంక పరిచయం అక్కర్లేని పేరు. రామాయణం తెలిసినవారందరికి లంక తెలిసే ఉంటుంది. వాల్మీకి రచనకు, వర్ణనలకు సాటిరాగల సాహిత్యం సంస్కృతంలో ఇంకెక్కడా దొరకదు. అందుకే కవికుల గురువు కాళిదాసు కూడా వాల్మీకినే అనుకరించాడు. సుందరకాండలో త్రికూట పర్వతం మీద రాత్రి దీపాలతో వెలుగుతున్న లంకను తొలిసారి చూసినప్పుడు వాల్మీకి అన్న మాట సకలలోకాల్లో గొప్పగా వెలిగే దేవతల రాజధాని అమరావతిలా లంక వెలుగుతోంది అని. ఆ రోజు రాత్రి, మరుసటిరోజు పగలు హనుమ కళ్లతో లంకను, దాని వైభవాన్ని వాల్మీకి మనకు చూపించాడు. నవరత్నాలు పొదిగిన స్తంభాలతో పెద్ద పెద్ద భవనాలు, అందమయిన పూల తోటలు, జలపాతాలు, అన్ని ఋతువుల్లో పండే అన్ని రకాల పళ్ల తోటలు, సుగంధ పరిమళాలు, రకరకాల మత్తు పానీయాలు, నానా రకాల మాంసాహారాలు . . . ఇలా ఒకటేమిటి ? రావణుడి లంకలో లేనిది లేదు. ఇంతా చేస్తే ఇంత గొప్ప లంక రావణుడు కట్టించినది కాదు. విశ్వ కర్మ కుబేరుడికోసం ముచ్చటపడి కట్టిస్తే- కుబేరుడిని తన్ని తగలేసి రావణుడు ఆక్రమించినది. రావణుడి పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది. నేలకు ఆనకుండా గాల్లోనే ఆగి ఉంటుంది పుష్పకవిమానం. అందులో గదులు, సోఫాలు , డెక్కులు, బాల్కనీలు, స్నానాల గదులు లెక్కలేనన్ని. కానీ, మేమెక్కిన శ్రీలంక ఎయిర్ లైన్స్ విమానంలో 160 మంది మాత్రమే పట్టారు. కొలొంబోలో నేలమీదే ల్యాండ్ అయ్యింది.

అక్కడి నుండి ప్రతిక్షణం నాకు వాల్మీకి వర్ణించిన లంక గుర్తొస్తోంది. ఉత్తరప్రదేశ్ లో తిరుగుతూ తొలిసారి అయోధ్యలో అడుగుపెట్టినప్పుడు కూడా వాల్మీకి నన్ను వెంటాడాడు. అ యుద్ధ – యుద్ధం లేనిది అయోధ్య. వాల్మీకి చూపిన అయోధ్యకు – ఇప్పుడు అయోధ్యకు అసలు పోలికే లేదు. రామాయణం నాటి సరయూ తీర అయోధ్య అందమే అందం. చతురస్రాకారపు కాలనీలు, విశాలమయిన వీధులు, పసుపు, గంధం, పేడ నీళ్లతో కళ్ళాపి చల్లి ముంగిట తీర్చిన ముగ్గులు, ఆ ముగ్గుల మధ్య చల్లిన పూలు. న మకుటీ, న స్రగ్వి, న కుండలి . . మెడలో హారాల్లేని వారు, చెవులకు ఆభరణాల్లేనివారు, తల జుట్టుకు అలంకారాల్లేనివారు అయోధ్యలో లేనేలేరట. తల్లిదండ్రులు బతికి ఉండగా చనిపోయిన పిల్లలున్న ఇళ్లే లేవట. ఇంకిన నదులు లేవు. పండని పోలాల్లేవు. గిట్టుబాటుధర రాని పంటలు లేవు. అసంతృప్తి ఉన్న మనిషే లేడు. అందుకే అది రామరాజ్యం. గొప్ప పాలనకు కొలమానం ఆ రామరాజ్యం.

నేను చూసిన ఇప్పటి అయోధ్యగురించి ఎలా చెప్పాలో నాకు తెలియదు. కొన్ని నిజాలకంటే- ఊహలే అందంగా, గొప్పగా, పవిత్రంగా ఉంటాయి.

లంకలో తిరుగుతుంటే- లంకంత కొంప సామెత గుర్తొచ్చింది. 21 కోట్ల జనాభా దేశం శ్రీలంక. చాలా యూరోప్ దేశాలకంటే పెద్దదే. అన్ని బోర్డులమీద పైన లంక అధికార భాష సింహళీ, కింద తమిళం , దాని కింద ఇంగ్లీషులో రాస్తున్నారు. 70 శాతం ప్రజలు బౌద్ధం అనుసరించేవారు. ఇక మిగతా 30 శాతంలో ముస్లిములు, క్రైస్తవులు, హిందువులు, ఇతరులున్నారు. సింహళీ లిపి తమిళం, మలయాళ లిపులకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. అనివార్యం, అవశ్య లాంటి మలయాళంలో వాడే శుద్ధ సంస్కృత పదాలు కూడా సింహళీలో వినిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు ఊటీ, కొడైకెనాల్లో తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఎటుచూసినా పచ్చదనం, టీ తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, కొబ్బరి చెట్లు, జోడిమామిడి తోటలు, వరి పొలాలు.

ఇండియా, యూరోప్ నుండి వచ్చే పర్యాటకులవల్ల శ్రీలంకకు బాగా ఆదాయం వస్తోందని స్థానికులు ఆనందంగా చెబుతున్నారు. ఉత్తర శ్రీలంకలో జఫ్నా ప్రాంతంలో తమిళుల ఆధిపత్యం. ఒకప్పుడు ఎల్ టీ టీ ఈ ప్రభావంతో ఆ ప్రాంతం ఎప్పుడూ అట్టుడుకుతుండేది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందట. మంచి హై వే లు, కొండా కోనల్లో కూడా మంచి రోడ్లు, సమాచార వ్యవస్థ, అధునాతన సౌకర్యాలు బాగున్నాయి.

వాల్మీకి వర్ణించిన అయోధ్యను ఇప్పటి అయోధ్యలో చూడలేము. అలాగే వాల్మీకి వర్ణించిన లంకను ఇప్పటి లంకలో చూడలేము. ఆర్య, ద్రావిడ వివాదంలోకి దిగితే దక్షిణ భారతీయులందరూ లంకకు దగ్గరివారే, బహుదూరపు బంధువులే. అందుకే తమిళనాడులో రావణుడు విలన్ కాదు- హీరో. ఇంతకంటే ఈ వివాదంలోకి వెళ్లడం భావ్యం కాదు. అవసరమూ లేదు.

లంకలో ఎన్నెన్నో పర్యాటక ప్రాంతాలు. పైగా మన దేశంలో ఎక్కడి నుండి అయినా రెండు, మూడు గంటల విమాన ప్రయాణం. కొత్త ప్రాంతాలు చూడాలన్న ఉత్సాహం ఉన్నవారికి లంక వెళ్లదగ్గ ప్రదేశమే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఆర్గానిక్ సాగు శ్రీలంక కొంప ముంచిందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్