కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నదని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. కొవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలకు మద్దతుగా పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి అందజేసిన మొబైల్ ఐసీయూ బస్సులను రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మంలో ప్రారంభించారు.
మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్‌కేర్ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు. కాగా తొలి విడుత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు లార్డ్స్ చర్చి ప్రతినిధులు అబ్రహం, రమేష్ లు వెల్లడించారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు 2 బస్సులను కేటాయించామని, మెడికల్ యూనిట్ బస్సులో వైద్య సేవల కోసం ఒక ల్యాబ్, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులతో పాటు ఆక్సిజన్ తో కూడిన 10 బెడ్లు ఏసీ సౌకర్యంతో అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.
బస్సులను ప్రారంభించిన అనంతరం బస్సులో ఉన్న వైద్య సదుపాయాలను మంత్రి పువ్వాడ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఎంహెచ్‌వో మాలతి సందీప్ తదితరులు పాల్గొన్నారు.