రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమానికి సహకరించాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30.76లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలను సేకరించామని సిఎం వివరించారు, దీని ద్వారా 17,005 కొత్త కాలనీలు రాష్ట్రంలో ఏర్పడ్డాయని రాజీవ్ కుమార్ కు తెలియజేశారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామన్నారు.
ఇళ్ల నిర్మాణ కార్యక్రమం సజావుగా సాగడానికి ప్రతి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌ను నియమించామన్న ముఖ్యమంత్రి ఈ 17,005 కొత్త కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి రూ. 34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని వివరించారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని, ఇళ్లు కట్టించి ఇచ్చి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుంటే.. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని, నీతి అయోగ్ దృష్టికి తీసుకెళ్ళారు. సంబంధిత మంత్రిత్వశాఖలతో మాట్లాడి ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగం చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కూడా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తో జగన్ చర్చించారు.